ఆదిత్యా.. నకిలీలలు చూసితివా?
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:07 AM
Duplicate passes in rathasapthami అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి సాక్షిగా గత నెల 25న నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భక్తి ముసుగులో భారీ దోపిడీ జరిగింది. ఆదిత్యుడి దర్శనం కోసం సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలో నరకయాతన అనుభవించగా.. మరోవైపు కొంతమందికి నకిలీ పాసులతో వీఐపీ దర్శనాలు సులువుగా జరిగిపోయాయి.
రథసప్తమి నాడు దొంగ పాసుల దందా
బాధ్యులైన అధికారుల గుండెల్లో గుబులు
ఫిర్యాదు చేసేందుకు దేవదాయశాఖ వెనుకంజ
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి సాక్షిగా గత నెల 25న నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భక్తి ముసుగులో భారీ దోపిడీ జరిగింది. ఆదిత్యుడి దర్శనం కోసం సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలో నరకయాతన అనుభవించగా.. మరోవైపు కొంతమందికి నకిలీ పాసులతో వీఐపీ దర్శనాలు సులువుగా జరిగిపోయాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు నకిలీ పాస్‌ల వ్యవహారంపై దృష్టి సారించారు. కానీ అసలు దొంగలను పట్టుకోవాల్సిన దేవదాయశాఖ మాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. నకిలీపాసుల కుంభకోణం తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతోనే అధికారులు ఫిర్యాదుకు వెనుకాడుతున్నారా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఆ పది వేల పాసులు ఎక్కడివి...?
పోలీసుల తనిఖీల్లో అరసవల్లిలోని ఓ అధికారి కార్యాలయంలోనే సుమారు రెండువేల పాసులు బయటపడడం కలకలం రేపుతోంది. వీటితోపాటు బయట చెలామణి అయినవి, థమన్ మ్యూజిక్‌షోకు వాడినవి మొత్తంగా పదివేల నకిలీ పాసులు ముద్రించినట్టు పోలీసుల నిఘాలో తేలింది. వీటికి హోలోగ్రామ్ స్టిక్కర్లు లేవు. అవసరానికి అనుగుణంగా ఎవరికి కావాలంటే వారికి రేట్లు మాట్లాడుకుని అంటగట్టడానికి వీటిని స్టాక్ పెట్టారా..? అన్నపశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనతే.. భారీగా నకిలీ పాసుల ముద్రణకు దారితీసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాసుల ముద్రణ లెక్కలు, పంపిణీ వివరాలు సరిగా లేకపోవడం చూస్తుంటే ఈ తతంగం కొందరు అధికారుల కన్నుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా, ఆలయ ఆదాయానికి భారీగా గండి పడినా.. పోలీసులకు దేవదాయశాఖ అధికారులు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు చేస్తే విచారణలో తమ పాత్ర కూడా బయటపడుతుందని వారు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం వెనుక అధికారపార్టీకి చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం ఉండడంతో వారు సైలెంట్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈవెంట్ షో పాసుల జారీను పర్యవేక్షించిన రెవెన్యూ అధికారులు సైతం నకిలీ పాసులపై ఫిర్యాదు చేయకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు
నకిలీ పాస్‌ల వ్యవహారంలో ఇప్పటివరకు 12 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. మూడు జిరాక్స్ సెంటర్లు నిర్వాహకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించారు. అయితే వీరిని పావులుగా వాడుకున్న అసలు సూత్రధారులు తెరవెనుక దర్జాగా తిరుగుతున్నారు. కేసు కోర్టు వరకు వెళితే సాక్షులు మాట మారుస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నిందితులను కాపాడేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదుచేసి అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు ఎంత సీరియస్‌గా విచారిస్తున్నా.. దేవదాయశాఖ అధికారులు ఫిర్యాదు చేయకపోతే కేసు ఎలా నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా అక్రమార్కులు తప్పించుకునే ప్రమాదం ఉంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని పలువురు భక్తులు పేర్కొంటున్నారు.