Share News

సిక్కోలులో అదానీ ‘టైటానియం’

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:10 AM

Green signal for the establishment of an integrated titanium complex పారిశ్రామిక ప్రగతి దిశగా జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త అందించింది. సిక్కోలు దశ, దిశను మార్చేలా జిల్లాలో రూ.13,667 కోట్ల భారీ పెట్టుబడితో ‘అదానీ ఇంటిగ్రేటెడ్‌ టైటానియం కాంప్లెక్స్‌’ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సిక్కోలులో అదానీ ‘టైటానియం’

రూ.13,667 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టైటానియం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

సీఐఐ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర

జిల్లా పారిశ్రామిక ప్రగతికి, స్థానిక యువత ఉపాధికి కొత్త ఊపిరి

శ్రీకాకుళం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక ప్రగతి దిశగా జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త అందించింది. సిక్కోలు దశ, దిశను మార్చేలా జిల్లాలో రూ.13,667 కోట్ల భారీ పెట్టుబడితో ‘అదానీ ఇంటిగ్రేటెడ్‌ టైటానియం కాంప్లెక్స్‌’ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే 30 అంశాల అజెండాకు ఆమోదముద్ర వేయగా, అందులో జిల్లాకు ఈ బృహత్తర ప్రాజెక్టు దక్కింది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ఆరు దిగ్గజ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ఆరు సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మొత్తం పెట్టుబడుల్లో మూడో వంతుకుపైగా.. శ్రీకాకుళం జిల్లాకే రూ.13,667 కోట్ల ప్రాజెక్టు దక్కడంపై జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19వేల కోట్లతో ఏర్పాటయ్యే కియా రెండో ఆటోమొబైల్‌ ప్లాంట్‌ తర్వాత, తాజా కేబినెట్‌ ఆమోదించిన ప్రాజెక్టుల్లో రెండో అతిపెద్ద పెట్టుబడిగా ఆదానీ టైటానియం కాంప్లెక్స్‌ నిలవడం గమనార్హం. దీనికి తోడు ఉత్తరాంధ్ర పరిధిలోని అచ్చుతాపురంలోనూ రూ.1800 కోట్లతో సెయింట్‌ గోబైన్‌ ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ పరిశ్రమకు అనుమతి లభించడంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక వేగం మరింత పుంజుకోనుంది. జిల్లాలో టైటానియం కాంప్లెక్స్‌ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అలాగే రవాణా, సేవా రంగాలు, వ్యాపారాల ద్వారా పరోక్షంగానూ పెద్ద సంఖ్యలో స్థానికులకు జీవనోపాధి లభించే అవకాశం ఉంది.

ఎంఎస్‌ఎంఈలకు ‘రైట్‌ టు బిజినెస్‌’ అండ...

పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేలా ‘ఏపీ ఎంఎస్‌ఎంఈ రైట్‌ టు బిజినెస్‌ బిల్లు-2026’కు సైతం మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ఊరటనివ్వనుంది. ఆదానీ టైటానియం కాంప్లెక్స్‌ వంటి భారీ ప్రాజెక్టుకు తోడుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా అనుబంధ పరిశ్రమలు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన ఏర్పాటయ్యేందుకు ఈ కొత్త బిల్లు ఎంతగానో దోహదపడుతుంది.

Updated Date - Nov 28 , 2026 | 12:11 AM