పదేళ్ల తర్వాత చర్యలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:52 PM
: సోంపేట మండలం ఎర్రముక్కాం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ ఇన్‌చార్జి వార్డెన్ (హెచ్‌డబ్ల్యూవో) కె.గురువులపై పదేళ్ల తరువాత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
- ఎర్రముక్కాం బీసీ హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ వార్షిక ఇంక్రిమెంట్ నిలిపివేత
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
శ్రీకాకుళం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సోంపేట మండలం ఎర్రముక్కాం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ ఇన్‌చార్జి వార్డెన్ (హెచ్‌డబ్ల్యూవో) కె.గురువులపై పదేళ్ల తరువాత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు మంజూరు కావాల్సిన ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను (క్యుములేటివ్ ఎఫెక్ట్ లేకుండా) నిలిపివేస్తూ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బుధవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్-అఫీషియో కార్యదర్శి ఎస్ సత్యనారాయణ అధికారిక ఉత్తర్వులు వెలువరించారు.
ఏం జరిగిందంటే..
2016 ఆగస్టు 4న ఎర్రముక్కాం వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా ఇన్‌చార్జి వార్డెన్ కె.గురువులు తదితరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అప్పటి ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ డ్రాఫ్ట్ చార్జీలను పంపించారు. దీనిపై స్పందించిన ఆనాటి ప్రభుత్వం ఆయనపై 5 అభియోగాలు (చార్జీలు) నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అయితే, తనపై మోపిన అభియోగాలను వార్డెన్ గురువులు లిఖితపూర్వకంగా ఖండించారు. ఆయన ఇచ్చిన సంజాయితీ సంతృప్తికరంగా లేకపోవడంతో, ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌ను విచారణాధికారిగా (ఎంక్వైరీ ఆఫీసర్) ప్రభుత్వం నియమించింది. విచారణ అనంతరం, వార్డెన్‌పై మోపిన అభియోగాల్లో ఒకటి రుజువైనట్లు సదరు విచారణాధికారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా వార్డెన్ నుంచి ప్రభుత్వం మరోసారి వివరణ కోరగా.. తనపై తదుపరి చర్యలు విరమించుకోవాలని ఆయన విజ్ఞపిత చేశారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. ఒక అభియోగం రుజువుకావడంతో ఆయనపై ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపివేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వుల అమలు కోసం తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.