ఆ ఇద్దరిపై వేటు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:01 AM
Suspension of Contract Assistant Professors ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.రామారావుపై, అలాగే విధుల్లో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ.. అనుచితంగా ప్రవర్తించిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.రామకృష్ణారావును సస్పెండ్ చేయాలని వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ కేఆర్ రజనీ ఆదేశించారు.
అంబేడ్కర్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సస్పెన్షన్
ఉత్తర్వులు జారీచేసిన రిజిస్ర్టార్
ఎచ్చెర్ల రూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.రామారావుపై, అలాగే విధుల్లో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ.. అనుచితంగా ప్రవర్తించిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.రామకృష్ణారావును సస్పెండ్ చేయాలని వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ కేఆర్ రజనీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య వారిద్దరినీ వంద రోజులపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వర్సిటీ అంతర్గత కమిటీలు, ఉమెన్ గ్రీవెన్స్ సెల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఫోన్‌లో అసభ్య సంభాషణ
ఇంజినీరింగ్ విభాగంలో హెచ్‌బీఎస్, హెచ్‌ఎస్‌ఎస్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎం.రామారావు పని చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో సెమిస్టర్ సీఎస్‌ఈ విద్యార్థినితో అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడారు. నెల రోజుల తర్వాత ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై మహిళా కమిషన్, ఉన్నత విద్యాశాఖ.. యూనివర్సిటీ అధికారులను నివేదిక కోరింది. దీంతో అధికారులు తాత్కాలికంగా ఆ ప్రొఫెసర్‌ను మే నెలలోనే సస్పెండ్ చేశారు. అనంతరం మే 9న విశ్రాంత వీసీ బాలమోహన్‌దాస్, ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ కె.సీతామాణిక్యం, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ధర్మారెడ్డితో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ సైతం నివేదిక అందజేసింది. కమిటీ ముందు హాజరు కాలేదన్న నెపంతో విద్యార్థినిని సైతం హాస్టల్ నుంచి పంపే ప్రయత్నం అధికారులు చేశారు. విద్యార్థిని ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ముందు హాజరై పూర్తిస్థాయి వివరణ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 1, 3 సెమిస్టర్లు యూనివర్సిటీ సర్వీస్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారావును సస్పెండ్ చేశారు. సెమిస్టర్‌కు పరీక్షతో కలిపి 100 రోజులు కాగా, ఆయన మే నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు.
క్రమశిక్షణా రాహిత్యం, బెదిరింపులు
ఇంజినీరింగ్ సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.రామకృష్ణారావుపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 1, 3 సెమిస్టర్లకు సస్పెండ్ చేశారు. పీఎం ఉషా ప్రోగ్రాం కోఆర్డినేటర్, ట్రైనర్ శ్రావణ్‌కుమార్‌ను పి.రామకృష్ణారావు గత ఏడాది నవంబరు 9న బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 22న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ రిలీవర్ ఎ.గణేష్‌బాబు, చీఫ్ సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎన్.అరుణకుమారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రామకృష్ణారావును సర్వీస్ నుంచి వంద రోజులు సస్పెండ్ చేశారు. ఫిర్యాదుదారులకు లిఖిత పూర్వక మౌఖిక క్షమాపణ సైతం చెప్పాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.