Share News

ప్రభుత్వ భూములకు రక్షకుడిగా వ్యవహరిస్తున్నా

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:54 PM

‘సెంటు జాగా కనిపిస్తే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు అనేకచోట్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేశార’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రభుత్వ భూములకు రక్షకుడిగా వ్యవహరిస్తున్నా
:సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘సెంటు జాగా కనిపిస్తే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు అనేకచోట్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేశార’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం టెక్కలిలో వంశధార ఈఈ కార్యాలయానికి, ఐసీడీఎస్‌ భవనం, వన్‌స్టాప్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లే మార్గంలో లైటింగ్‌, సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ప్రభుత్వ భూములకు రక్షకుడిగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. స్వర్ణకారుల స్థలానికి సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు లేవని, సభ్యులు కానివారు వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశారని అన్నారు. సుప్రీం కోర్టును ఆశ్రయించైనా స్వర్ణకారులకు న్యాయం చేస్తాన ని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు పక్కగా ఉన్న స్థలాన్ని అప్పటి సీఐ అమ్మేశాడని తెలిపారు.

20 నెలల్లో ప్రతి ఇంటికీ తాగునీరు

టెక్కలికి రూ.640కోట్లతో మంజూ రైన రక్షిత మంచినీటి పథకం 20 నెలల్లో పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు. అసంపూర్తిగా మిగిలిన అంగన్‌వాడీ భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. టెక్కలిలో రెండు ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. టెక్కలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో నమోదైందని, కండ్రవీధి వాసులతో పాటు ఎవరు ఇళ్లు కడతామన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి, ఈఈ శేఖరరావు, ఏ ఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, ఎల్‌ఎల్‌ నాయుడు, పినకాన అజయ్‌కుమార్‌, జోగారావు, కింజరాపు ప్రసాద్‌, హనుమం తు రామకృష్ణ, లవకుమార్‌, లాడి శ్రీనివాస్‌, కామేసు, ప్రసాద్‌రెడ్డి, దమయంతి, సుంద రమ్మ, పోలాకి షణ్ముఖరావు, సీడీపీవో విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

సెప్టెంబరు 23న రైలు ఢీకొని మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను మంత్రి పరామర్శిం చారు. గురువారం టెక్కలిలో డమర గ్రామానికి చెందిన మృతుడు జన్ని దిలీప్‌, గంగువాడ విశాఖరావు, చిన్నభీంపురానికి చెందిన జన్ని శరత్‌ తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షల వంతున మంత్రి అచ్చెన్నాయుడు చెక్కులు అందజేశారు.

బస్సుషెల్టర్‌ ఆక్రమణపై...

స్థానిక పెద్దబ్రాహ్మణవీధి జంక్షన్‌లో అక్రమంగా బస్సు షెల్టర్‌ నిర్మాణం జరుగుతుందంటూ జరుగుతున్న ఆందోళన కు మంత్రి అచ్చెన్నాయుడు చెక్‌ పెట్టారు. గురువారం స్థానికులు నిరసన వ్యక్తం చేయగా ...సంబంధిత టీడీపీ కార్యకర్త మామిడి రామును పిలిచి నాలుగు అడుగుల స్థలం విడిచిపెట్టి న్రిర్మాణం చేసుకోవాలని... అవసరమైతే బస్సు షెల్టర్‌కు నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను చెప్పిన విధంగా పరిష్కరించాలని తహశీల్దార్‌ రాంబాబుకు మంత్రి సూచించారు.

నేనున్నప్పుడే ఐదుసార్లు సరఫరాకు అంతరాయం

విద్యుత్‌ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం

టెక్కలి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘నేను కార్యాలయంలో ఉన్నప్పుడే ఐదుసార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇలాగే సరఫరా చేస్తారా? అని సంబంధిత అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో విద్యుత్‌ శాఖ యంత్రాంగం పనితీరు సక్రమంగా లేదని పలువురు కార్యకర్తలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో గురువారం ఆయన సంబంధిత ఏఈ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ నర్సింహ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఈ పనితీరు మార్చుకోమని చెప్పాలని... పని చేయకపోతే మరోచోటకు తప్పించండి అని మంత్రి అన్నారు. రాంపురంలో విరిగిన స్తంభాలు మార్చడానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ఏఈని మంత్రి ప్రశ్నించారు. రాంనగర్‌, నీలాపురం ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనీసం ఈసీజీ తీయడానికి టెక్నీషియన్స్‌ లేరని... గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వస్తుందని పినకాన అజయ్‌కుమార్‌ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సంబంధిత సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది లేకపోతే తనకు తెలియజేయాలని సూచించారు. ఇంకోసారి ఈ సమస్య రాకుండా చూడాలని, వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Oct 08 , 2026 | 11:54 PM