పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:56 PM
పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. మందస మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన కొర్రాయి తిరుపతిరావు రెండున్న రేళ్లుగా వెంటపడుతూ అసభ్యకరంగా మాట్లాడడం, ఒకానొక సమయంలో పాఠశాల నుంచి వస్తున్న ఈ బాలిక చేయి పట్టుకుని వేధించడంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు మందస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ నిందితుడు తిరుపతిరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత వాదోపవాదాలు విన్న తరువాత నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక వేధింపుల కేసుల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు బాలిక ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి ఘటనలు గమనిం చినప్పుడు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.