Share News

అసోం యువతిది ప్రమాదవశాత్తు మృతే

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:31 AM

రైలులో ప్రయాణిస్తూ మృతి చెందిన అసోం రాష్ట్రానికి చెందిన యువతి బోరో హిమశ్రీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. అసోం పోలీసు ఐజీ జీవీ శివప్రసాద్‌, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో అధికారుల బృందం శనివారం పొందూరు మండలం పెనుబర్తి గ్రామం వద్ద ఘటనా స్థలిని పరిశీలించి విచారణ చేపట్టింది.

అసోం యువతిది ప్రమాదవశాత్తు మృతే
దర్యాప్తు చేస్తున్న అసోం రాష్ట్ర ఐజీ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ

  • పోస్టుమార్టం నివేదికతో ప్రాథమిక నిర్ధారణ

  • ఈనెల 8న పెనుబర్తి సమీపంలో మృతదేహం లభ్యం

  • అంతకుముందు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం

  • ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యం

  • అసోం ఐజీ, శ్రీకాకుళం ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

పొందూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రైలులో ప్రయాణిస్తూ మృతి చెందిన అసోం రాష్ట్రానికి చెందిన యువతి బోరో హిమశ్రీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. అసోం పోలీసు ఐజీ జీవీ శివప్రసాద్‌, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో అధికారుల బృందం శనివారం పొందూరు మండలం పెనుబర్తి గ్రామం వద్ద ఘటనా స్థలిని పరిశీలించి విచారణ చేపట్టింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.

సోషల్‌ మీడియాలో ప్రచారంపై దృష్టి

అసోంలో ఈ ఘటనపై సోషల్‌ మీడి యాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఐజీ జీవీ శివప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ 2 బోగీలో యువకులు మద్యం తాగుతున్నారని, పురుషు లే ఎక్కువగా ఉన్నారని, భయంగా ఉందం టూ యువతి మాట్లాడిన ఆడియో వైరల్‌ కావడంతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించా రని చెప్పారు. యువతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖలు రాశారని వివరించారు. దర్యాప్తు కోసం తనను ప్రత్యేక అధికారిగా నియమించారని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యంతో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, విశాఖపట్నం ఐజీ, శ్రీకాకుళం ఎస్పీ సమన్వయంతో విచారణ కొనసాగిస్తున్నారని చెప్పారు. జిల్లా పోలీ సుల దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు.

అన్ని కోణాల్లో విచారణ

శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలన జరిపినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రాథమికంగా ప్రమాద వశాత్తు మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. అయితే, ఎవరైనా తోసివేయడం వల్ల ఆమె రైలు నుంచి పడిపోయి ఉంటుందనే అనుమానాన్నీ పరిగణనలోకి తీసుకుని ఆధారాల న్నింటినీ పరిశీలిస్తున్నామని వివరించారు. ఎస్‌ 2 బోగీలోని సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను గుర్తించి విచారిస్తామని తెలి పారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిం చిన అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు చెప్పారు.

ఏం జరిగిందంటే..

అసోంలోని గువాహటికి చెందిన హిమశ్రీ డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. విశాఖపట్నంలో డ్యాన్సర్‌గా మంచి ఆదాయం ఉంటుందని అక్కడి స్నేహితురాలు సూచించడంతో ఆగస్టు 16వ తేదీన కొంతమంది డ్యాన్సర్ల బృందంతో విశాఖకు వచ్చింది. ఉద్యోగ పరీక్షలు ఉండటంతో తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నెల 4వ తేదీన రిజర్వేషన్‌ చేసుకున్న రైలు రద్దు కావడంతో 5వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో విశాఖపట్నం నుంచి అస్సాం-డిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటికి బయలుదేరింది. రిజర్వేషన్‌ లేకపోవడంతో ఆమె స్నేహితురాలు టీటీఈని సంప్రదించింది. జనరల్‌ టికెట్‌ తీసు కుని ఎస్‌ 2 బోగీలో ఎక్కాలని, సీటు ఖాళీ అయిన తర్వాత కేటాయి స్తానని చెప్పడంతో హిమశ్రీ ఆ బోగీలోకి వెళ్లింది. కూర్చోవడానికి చోటు లేకపోవడంతో తలుపు వద్ద కూర్చుంది. బోగీలో పురుషులే ఎక్కువగా ఉన్నారని, కొందరు మద్యం తాగుతున్నారని, భయంగా ఉందని హిమశ్రీ తన స్నేహితురాలు జ్యోతికి ఫోన్‌ చేసి చెప్పింది. మరుసటి రోజు వరకు ఎలా ఉంటుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు సహాయం అందేలా చూడాలని కోరింది. కొంత సేపటి తర్వాత స్నేహితులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో వారు రైల్వే ఫిర్యాదుల విభాగానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈనెల 8న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి సమీ పంలో రైల్వేట్రాక్‌కు సమీపంలో ఆమె మృతదేహం కనిపించింది. స్థానికులు రైల్వేపోలీసులు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలా నికి వచ్చారు. జిల్లా పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఘటనాస్థలిని పరిశీలించి ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు హిమశ్రీ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు చెబుతున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:31 AM