‘అభ్యుదయం’.. దిగ్విజయం
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:32 AM
'Abhyudayam Cycle Tour' సమాజంలో గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల నియంత్రణకుగాను పోలీస్ శాఖ సామాజిక బాధ్యతగా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో నిర్వహించిన అభ్యుదయ సైకిల్‌యాత్ర దిగ్విజ యంగా ముగిసింది.
53 రోజులు నిర్విరామంగా సాగిన ‘సైకిల్ యాత్ర’
పాయకరావుపేటలో ప్రారంభం.. ఇచ్ఛాపురంలో ముగింపు
నాలుగు జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్లు ప్రయాణం
డ్రగ్స్‌తో అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు
ఇచ్ఛాపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సమాజంలో గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల నియంత్రణకుగాను పోలీస్ శాఖ సామాజిక బాధ్యతగా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో నిర్వహించిన అభ్యుదయ సైకిల్‌యాత్ర దిగ్విజ యంగా ముగిసింది. నాలుగు జిల్లాల పరిధిలో 53 రోజులపాటు నిర్విరామంగా 1300 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. గతేడాది నవంబరు 13న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమైన యాత్ర.. శనివారం ఇచ్ఛాపురంలో దిగ్విజయంగా ముగిసింది.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒడిశాలో సాగుచేస్తున్న గంజాయి ఉత్తరాంధ్ర మీదుగా రవాణా సాగుతోంది. గంజాయి మత్తుకు బానిసై కొంతమంది విద్యార్థులు, యువత భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు. ఈక్రమంలో కూటమి ప్రభుత్వం వాటిని నియంత్రించేందుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అని పిలుపునివ్వడంతో అధికారులు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. విశాఖ రేంజ్‌లో గంజాయి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 25 మంది కానిస్టేబుళ్లతో గతేడాది నవంబరు 13న అభ్యుదయ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీతోపాటు ఐదు జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో సైకిల్‌యాత్ర విజయవంతంగా నిర్వహించారు. దారి పొడవునా గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వినియోగంతో కలిగే దుష్పరిణామాలను కళారూపాలతో అవగాహన కల్పించారు. జిల్లాలో గత ఏడాది డిసెంబరు 15న ఈ సైకిల్ యాత్ర ప్రవేశించింది. జిల్లాలో 30 మండలాలను కలుపుతూ సాగిన యాత్రకు జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోలీసులతో పాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు యాత్రలో భాగస్వామ్యమయ్యారు. ముగింపులో భాగంగా ఇచ్ఛాపురంలో పైలాన్ ఆవిష్కరణ, భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో పోలీస్ శాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే జిల్లాకు ఒకటి నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో గంజాయితోపాటు నిషేధిత మత్తుపదార్థాల రవాణా నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.