రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:35 AM
జేఆర్ పురం పోలీసు సర్కిల్ కార్యాలయం సమీపంలో జాతీయ రహ దారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తమ్మాపురానికి చెందిన దువ్వు కోటేశ్వరరావు (26) మృతి చెందాడు.
రణస్థలం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జేఆర్ పురం పోలీసు సర్కిల్ కార్యాలయం సమీపంలో జాతీయ రహ దారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తమ్మాపురానికి చెందిన దువ్వు కోటేశ్వరరావు (26) మృతి చెందాడు. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోటేశ్వరరావు తల్లి, సోదరుడితో తాతగారి గ్రామం వల్లభరావుపేటకు శుక్రవారం వచ్చాడు. తల్లికి వైద్య పరీక్షలు చేయించేందుకు శనివారం మండల కేంద్రంలో ని ఒక ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చాడు. తిరిగి వల్లభరావు పేట వెళ్తుండగా సీఐ కార్యాలయ సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కోటేశ్వరరావు హైదరాబదులోని ఓ కంపెనీ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
వ్యాన్ ఢీకొని బాలుడి..
పూసపాటిరేగ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పేరాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో విశాఖలో నివాసం ఉంటున్న సిరా ఖనీష్(6) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖలోని అచ్యుతాపురం ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న సిరా కిరణ్‌కుమార్ అనే వ్యక్తి తమ సొంతగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని అదపాకకు రెండు రోజుల కిందట వెళ్లాడు. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై తిరిగి విశాఖకు కిరణ్‌కుమార్, తన బావమరిది లోకేష్, పెద్ద కుమారుడు ఖనీష్‌తో వస్తుండగా పేరాపురం వద్ద వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఖనీష్ అక్కడిక్కడే మృతి చెందగా లోకేష్, కిరణ్‌కుమార్‌కు బలమైన గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లోకేష్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తీసు కెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.