వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని...
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:42 PM
: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందని సంబంధిత వైద్యుల ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతిరాలి బంధువులు ఆందోళనకు దిగారు. నరసన్నపేటలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.
నరసన్నపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందని సంబంధిత వైద్యుల ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతిరాలి బంధువులు ఆందోళనకు దిగారు. నరసన్నపేటలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేటకు చెందిన బుద్దల దివ్య ప్రసవం కోసం (రెండో కాన్పు) ఈ నెల ఒకటో తేదీన నరసన్నపేట ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆ రోజు విధుల్లో ఉన్నన స్ర్తీవైద్య నిపుణురాలు చల్ల కృషి అదే రోజు మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు. దివ్య ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే రోజు సాయంత్రం దివ్యక రక్తస్రావం కావడంతో పాటు పొట్ట ఉబ్బరాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు పరిశీలించి..మరోసారి శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న రక్తపు ముద్దలను తొలగించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 2న దివ్య మృతిచెందింది. ఆమె మృతికి నరసన్నపేట ప్రాంతీయ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసిన వైద్యుల నిర్లక్ష్యమే కారణమని... పీజీ విద్యార్థులతో శస్త్ర చికిత్స చేయించారని బంధువులు ఆరోపించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు చల్ల కృషి నిర్లక్ష్యంతో మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యురాలికి చెందిన క్లినిక్ వద్దకు మంగళవారం భైరివానిపేట గ్రామస్థులు చేరుకొని వైద్యుల తీరుపై నిలదీశారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటనకు ప్రైవేటు ఆసుపత్రి వద్ద నిలదీయంతో ఆసుపత్రి వర్గాలు ప్రతిఘటించాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ శ్రీనివాసరావు ఆదేశాలతో నరసన్నపేట, పోలాకి, జలుమూరు ఎస్‌ఐలు గణేష్, రంజత్, అశోక్‌బాబుల ఆఽద్వర్యలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయంపై ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసబాబు వద్ద ప్రస్తావించగా... ఆపరేషన్ విజయవంతమైందని.. తరువాత రక్తస్రావం ఎక్కువ కావడంతో రక్తకణాలు తగ్గి దివ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందన్నారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశామని తెలిపారు. ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని... శస్త్రచికిత్స వికటించ లేదని తెలిపారు. ఇదిలా ఉండగా... తన పిల్లలకు తల్లి లేని లోటు ఎవరు తీర్చుతారని? న్యాయం చేయాలని దివ్య భర్త బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
పాపం పసివాళ్లు ...
దివ్య మృతి చెందడంతో పిల్లలు తల్లి లేని వారయ్యారు. దివ్యకు మొదటి కాన్పులో ఓ కుమార్తె పుట్టింది. ఆమెకు రెండేళ్లు. రెండోసారి కూడా కుమార్తెకు జన్మనిచ్చింది. అమ్మ లేదని...ఇక రాదని తెలియక నాన్నమ్మ పక్కనే కూర్చొని దీనంగా చూస్తున్న పెద్దకుమార్తెను... ఇటీవల పుట్టిన పసికందును చూసి...వారి పరిస్థితిని తెలుసకున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి.
\