విషాద ప్రయాణం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:43 AM
Car-Lorry Collision.. two members dead వివాహమై ఏడేళ్ల తరువాత ఎన్నో నోములు నోచుకొన్నాక.. లేకలేక పుట్టిన బిడ్డ కావడంతో ఆమె కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో తండ్రి కూడా చూడకుండా క్షణమైనా ఉండలేకపోయేవాడు. ఇక తాత వెంటే మనవడు. మనవడ్ని వదలని తాత. బయటికి వెళ్తే తాత ఒడిలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు. చిన్నారి ముద్దు ముద్దు మాటలు వింటూ తాత మురిసిపోయేవాడు. సోమవారం కూడా కారులో వెళ్తున్న ఆరుగురిలో.. ఐదుగురు చిన్నారితో ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండు గంటల పాటు వారి ప్రయాణం సాగింది. మరికొద్ది నిమిషాల్లో గమ్యం కూడా చేరుకుంటారనగా కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. పక్క రహదారిపైకి వెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న చిన్నారి తండ్రి తేరుకునేలోపే లారీ వచ్చి ఢీకొని ఈడ్చుకుపోయింది.
మృత్యువులోనూ తాతను వీడని మనవడు
చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలు
తల్లి, అమ్మమ్మ, అక్కకు గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు డివైడర్ ఎక్కి లారీని ఢీకొనడంతో ఘటన
కంచిలిలో శోకసంద్రం
వివాహమై ఏడేళ్ల తరువాత ఎన్నో నోములు నోచుకొన్నాక.. లేకలేక పుట్టిన బిడ్డ కావడంతో ఆమె కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో తండ్రి కూడా చూడకుండా క్షణమైనా ఉండలేకపోయేవాడు.
ఇక తాత వెంటే మనవడు. మనవడ్ని వదలని తాత. బయటికి వెళ్తే తాత ఒడిలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు. చిన్నారి ముద్దు ముద్దు మాటలు వింటూ తాత మురిసిపోయేవాడు. సోమవారం కూడా కారులో వెళ్తున్న ఆరుగురిలో.. ఐదుగురు చిన్నారితో ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండు గంటల పాటు వారి ప్రయాణం సాగింది. మరికొద్ది నిమిషాల్లో గమ్యం కూడా చేరుకుంటారనగా కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. పక్క రహదారిపైకి వెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న చిన్నారి తండ్రి తేరుకునేలోపే లారీ వచ్చి ఢీకొని ఈడ్చుకుపోయింది. అంతే.. అంతవరకూ సరదాగా మాటలాడుకున్న వారి నోట హాహాకారాలు. చిట్టిపొట్టి మాటలాడిన చిన్నారి అచేతనంగా మారిపోయాడు. మనవడ్ని కుశల ప్రశ్నలు వేసిన తాతయ్య మాట ఆగిపోయింది. చిన్నారి తండ్రి, తల్లి, అమ్మమ్మ, అక్క వరసైన బాలిక గాయాలతో తల్లడిల్లిపోయారు. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో ఎత్తుబ్రిడ్జి దిగువన మలుపులో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదమిది.
చిట్టి తండ్రి ఎలా ఉన్నాడు?
గాయాలతో చికిత్స పొందుతున్న తల్లి ‘ నా గారాలపట్టి, చిట్టి తండ్రి ఏవిధంగా ఉన్నాడు... కారులో తాత ఒడిలో కూర్చొని సెల్ చూస్తున్నాడా.. బాగానే ఉన్నాడా..’ అంటూ సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అడుగుతూ ఉండడంతో ఎవరికీ నోట మాట రాలేదు. బిడ్డ కోసం కన్నతల్లి తపన చూసి వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు స్థానికులు ఎంత కష్టం వచ్చిందంటూ బాధ పడ్డారు.
భోగాపురం/కంచిలి, జూన్ 22(ఆంధ్రజ్యోతి):
రాపాక కిషోర్, ఉమామేశ్వరి, ఏడాదిన్నర బిడ్డ సాత్విక్‌తో కలిసి విశాఖపట్నం జిల్లా మధురవాడలో నివాసముంటున్నారు. వివాహమై ఏడేళ్ల తరువాత లేకలేక సాత్విక్ జన్మించాడు. ముగ్గురూ కలిసి పదిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కంచిలిలో ఉన్న చిన్నారి తాతయ్య ఇంటికి వెళ్లారు. తాత మన్యాల సూరిబాబు, అమ్మమ్మ లక్ష్మి, వీరి పెద్దకుమార్తె కూతురు తునికి చెందిన కొయ్యనేహశ్రీ కూడా వీరి ఇంటిలోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే మరో నాలుగు రోజుల్లో రాజమండ్రిలో బంధువుల వివాహం ఉండడంతో ముందుగా వెళ్లి రెండు రోజులు మధురువాడలో కుమారై ఇంటి దగ్గర ఉండి తరువాత అక్కడి నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు కుటుంబమంతా నిర్ణయించుకున్నారు. దీంతో కంచిలికి చెందిన మన్యాల సూరిబాబు, లక్ష్మి, తునికి చెందిన బాలిక కొయ్య నేహశ్రీ, మధురువాడకు చెందిన రేపాక కిషోర్, ఉమామహేశ్వరి, బాలుడు సాత్విక్ కలిసి కారులో కంచిలి నుంచి సోమవారం ఉదయం బయలు దేరారు. రేపాక కిషోర్ డ్రైవింగ్ చేస్తుండగా ముందు సీట్టో మన్యాల సూరిబాబు, ఈయన ఒడిలో మనవడు సాత్విక్ కూర్చొన్నారు. వెనుక సీట్లో ఉమామహేశ్వరి, లక్ష్మి, నేహశ్రీ కూర్చొన్నారు. తాత ఒడిలో సాత్విక్ కూర్చొని సెల్‌ఫోన్ చూస్తూ వచ్చీరాని మాటలాడుతూ ఆడుకొంటున్నాడు. మనవడి ఆటను చూస్తూ, మాటలు వింటూ తాత మురిసిపోతున్నాడు. అలా జాతీయ రహదారిపై వెళ్తుండగా భోగాపురం మండలం పోలిపల్లి సమీప ఎత్తుబ్రిడ్జి దిగువన మలుపు వద్దకు వచ్చేసరికి అతివేగం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి విశాఖవైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే రహదారిపైకి మళ్లింది. అదే సమయంలో అదే రహదారిలో వస్తున్న లారీ కారును బలంగా ఢీకొంది. కారును సుమారు 10 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. దీంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ముందు కూర్చొన్న తాతమనవళ్లు మన్యాల సూరిబాబు(60), ఏడాదిన్నర వయసున్న రాపాక సాత్విక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న కిషోర్ కారులో ఇరుక్కుపోయాడు. సీఐ దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది వెళ్లి గాయపడిన వారిని 108లో సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో ఇరుక్కుపోయిన కిషోర్‌ను గంటకు పైగా శ్రమించి బయటకు తీశారు. ఈయన్ని 108లో తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తాత మనవళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుందరపేటలో చికిత్స పొందిన చిన్నారి తల్లి ఉమామేశ్వరి, ఇంకో ఇద్దరిని తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కొంత సమయం ట్రాఫిక్ ఆగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గాప్రసాదరావు తెలిపారు.
మన్యాల సూరిబాబు కంచిలిలో చెప్పుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో రేడియో మెకానిక్‌గా పనిచేసేవాడు. బైపాస్ రోడ్డు నిర్మాణ సమయంలో ఉపాధి కోల్పోయి ఆ తర్వాత స్థానికంగా చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు.