రెప్పపాటులో ఘోరం
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:32 AM
Lorry rams into auto; three women killed రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఓ లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఆటోని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే సమయంలో నీరు తాగేందుకు వెళ్లి ఆటో వద్దకు వచ్చిన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డాడు.
నాటుకోడిని ఇచ్చేందుకు ఆపిన ఆటో
వెనుక నుంచి వేగంగా ఢీకొన్న లారీ
ముగ్గురు మహిళలు దుర్మరణం
మరో నలుగురికి గాయాలు
ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్
జమేదారుపుట్టుగ జంక్షన్ వద్ద ఘటన
కవిటి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఆదివారం కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కోడి మాంసం తింటారని ఆరాటపడింది ఆ ఇల్లాలు. తోటి మహిళలతో కలిసి సంతలో నాటుకోడితోపాటు పనసపండ్లను కొనుగోలు చేసి ఆటోలో బయలుదేరింది. పనసపండ్లను వేరేచోట అమ్ముకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆలస్యమవుతుందని భావించింది. దారిమధ్యలో జంక్షన్ వద్ద ఆటోని నిలిపివేయించి బంధువులకు కోడిని ఇచ్చి దాన్ని భర్తకు అందించాలని చెప్పింది. తిరిగి వచ్చి ఆటో ఎక్కింది. అంతే రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఓ లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఆటోని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే సమయంలో నీరు తాగేందుకు వెళ్లి ఆటో వద్దకు వచ్చిన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డాడు. కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు..
కవిటి మండలం రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మ (60), గుజ్జుపుట్టుగకు చెందిన మురపాల పార్వతి(50), ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని ఏఎస్‌పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ(52) పాటు ఎన్.ఎర్రయ్య, బి.ఢిల్లమ్మ, బి.కామాక్షి, మోహిని సంతల్లో సీజన్‌బట్టి పండ్లు, కాయలు కొనుగోలు చేసి వాటిని ఒడిశా రాష్ట్రం బరంపురంలో విక్రయిస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం కంచిలి మండలం మఖరాంపురం సంతకు వెళ్లారు. పనసకాయలు, పండ్లు కొనుగోలు చేశారు. పార్వతి నాటుకోడిని కొనుగోలు చేసింది. అంతా కలిసి బరంపురం వెళ్లే లగేజీ ఆటో ఎక్కి బయలుదేరారు. మార్గమధ్యలో కవిటిలోని జమేదారుపుట్టుగ జంక్షన్‌లో కాలనీ వద్ద ఆటోను నిలుపుదల చేసి పార్వతి సంతలో కొనుగోలు చేసిన నాటుకోడిని బంధువులకు ఇచ్చి దాన్ని తన భర్తకు అందించాలని చెప్పింది. డ్రైవర్ కూడా కిందకు దిగి నీరు తాగేందుకు వెళ్లాడు. సరిగ్గా ఉదయం 9.20 గంటల సమయంలో పార్వతి తిరిగి వచ్చి ఆటో ఎక్కింది. డ్రైవర్ కేశవులు కూడా ఎక్కేందుకు తలుపు తీస్తుండగా వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆటో జాతీయ రహదారి నుంచి కిందకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. అంతే ఆటోలో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభం విరిగిపోయినా కింద పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను 108 వాహనంలో ఇచ్ఛాపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో మోహిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బరంపురంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానికులు టోల్‌గేట్ వద్ద పట్టుకున్నారు.
విషయం తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి రోదించడం అందరినీ కలచివేసింది. కేవలం కోడి ఇచ్చేందుకు ఆటోని నిలిపివేశారని, లేదంటే ఈ ఘోరం జరిగేదికాదని అక్కడివారు చర్చించుకున్నారు. ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఇచ్ఛాపురం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మృతుల్లో వదిన, మరదలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్వతి, తరిణమ్మ, పద్మ.. శిలగాం పంచాయతీ గుజ్జుపుట్టుగ గ్రామానికి చెందిన వారే. వీరిలో పార్వతి, తరిణమ్మ వదినమరదలు అవుతారు. పార్వతి భర్త ఢిల్లీరావుకు తరిణమ్మ స్వయాన చెల్లెలు. వివాహలు కావడంతో తరిణమ్మ ఏఎస్‌పేట, పద్మ రాపాకపుట్టుగలోని అత్తవారింటికి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. పార్వతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త డిల్లీరావు ఆరోగ్యరీత్యా ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. తరిణమ్మ భర్త దాలయ్య, కుమారుడు ఆనంద్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. ఆనంద్ స్థానికంగా ఉపాధి లేకపోవడంతో దుబాయ్ వెళ్లి పని చేసుకుని వస్తుంటాడు. మరో మృతురాలు పద్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్రంగా గాయపడి బ్రహ్మపుర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహినికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లిపరిస్థితిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడంతో గుజ్జుపుట్టుగలో విషాదచాయలు అలముకున్నాయి.