గురువులకే పరీక్ష!
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:35 AM
పాఠాలు బోధించే గురువులకు పరీక్ష భయం పట్టుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్‌తో అల్లాడిపోతున్నారు. దాని కోసం సన్నద్ధమవుతున్నారు.
- టెట్‌తో ఉపాధ్యాయుల్లో టెన్షన్
- పగలు బోధన.. రాత్రి పుస్తకాలతో కుస్తీ
- ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటున్న కొందరు టీచర్లు
శ్రీకాకుళం, ఎడ్యూకేషన్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): పాఠాలు బోధించే గురువులకు పరీక్ష భయం పట్టుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్‌తో అల్లాడిపోతున్నారు. దాని కోసం సన్నద్ధమవుతున్నారు. కొందరైతే ఏకంగా కోచింగ్ సెంటర్లకే వెళ్తున్నారు. అక్కడ క్లాసులు వింటున్నారు. అక్కడ చెప్పిన దానిని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ఒకవైపు బడిలో బోధనపై శ్రద్ధ పెట్టలేక.. మరొక వైపు టెట్ కోసం సిద్ధం కాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, బోధనపై శ్రద్ధ పెట్టట్లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2028 ఆగస్టు 30 నాటికి టెట్ ఉత్తీర్ణత సాఽధించకపోతే ప్రమోషన్, చివరకు ఉద్యోగమే కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో టీచర్లందరికీ టెట్ ఫీవర్ పట్టుకుంది.
టెట్ రాయాల్సిందే..
జిల్లాలో మొత్తం 13వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 2010 కన్నా ముందుగా టీచర్ ఉద్యోగాలు పొందినవారు టెట్ రాయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 12వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సుమారు 9,800 మంది ఉపాధ్యాయులు 2011 ముందే నియమాకం పొందారు. వీరిలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన టెట్ పరీక్షకు కేవలం 14శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 5శాతం మాత్రమే అర్హత సాధించారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి పోటీపడుతున్నారు. జూలై 5వ తేదీ వరకు గడువు ఉంది. ఆగస్టులో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మినహాయించాలంటూ నిరసనలు
టీచర్లు ఓ వైపు పరీక్షకు ప్రిపేర్ అవుతూనే.. మరోవైపు టెట్ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. విద్యాహక్కు చట్టం 2010లో వచ్చిందనీ, అప్పటి నుంచి టెట్ నిబంధన ఉందంటున్నారు. అంతకన్నా ముందుగా డీఎస్సీ రాసి ఎంపికై 20 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇపుడు టెట్ పాస్ తప్పనిసరి చేయడం సరికాదని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుని, సీనియర్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని కోరుతున్నారు. టీచర్లకు సబ్జెక్టుల వారీగానే ప్రత్యేక టెట్ నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న ప్రచారం జరుగుతున్నా.. ఉపాధ్యాయ వర్గాలకు మాత్రం టెట్ టెన్షన్ తప్పడం లేదు.