అశ్రునయనాలతో అప్పలసూర్యనారాయణకు వీడ్కోలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:00 AM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
- ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు
- అంతిమయాత్రలో జనసంద్రం
- కన్నీటిపర్యంతమైన నేతలు
శ్రీకాకుళం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అరసవల్లిలోని ఆయన స్వగృహం నుంచి అప్పలసూర్యనారాయణ భౌతికకాయంతో నగరంలో అంతిమయాత్ర నిర్వహించారు. జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళి అర్పించారు. జనం మెచ్చిన నేత దేవుని వద్దకు వెళ్లిపోయారంటూ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పలసూర్యనారాయణ భార్య, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కుమారులు గంగాధర్, విశ్వనాథ్‌ను నాయకులు ఓదారుస్తూ.. వారు కూడా రోదించడం అందరినీ కలిచివేసింది.
- అరసవల్లిలోని శ్మశానవాటికలో అప్పలసూర్యనారాయణ పార్థివదేహంపై జాతీయ జెండాను కప్పారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి నివాళి అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన భౌతికకాయంపై కప్పారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. దీంతో అధికారిక లాంఛనాలతో మాజీమంత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
- తన మిత్రుడ్ని కోల్పోవడంతో దుఃఖం తట్టుకోలేక మాజీమంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కన్నీటిపర్యంతమయ్యారు. శ్మశాన వాటిక వద్ద శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.. తన గురువు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ రోదించారు. ఏపీ పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, పాతపట్నం, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, నడుకుదిటి ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీస్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితరులు అప్పలసూర్యనారాయణకు నివాళి అర్పించారు.
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం చేరుకున్నారు. వెనువెంటనే గుండ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పలసూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని ఓదార్చారు.