Share News

చెరువు, గెడ్డ.. అయితే మాకేం!

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:24 AM

ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఆక్రమించడం.. అడ్డగోలుగా ధ్రువపత్రాలు పొందడం.. ప్రభుత్వ భూమిని కైంకర్యం చేయడం పరిపాటిగా మారింది.

చెరువు, గెడ్డ.. అయితే మాకేం!
వేల్పురాయి పెద్ద చెరువును చదును చేసి ఆక్రమించిన దృశ్యం

  • కబ్జాచేసి భూముల్లో కలిపేసుకున్న వైనం

  • ఎనిమిది ఎకరాల వరకూ ఆక్రమణలు

  • జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని రైతుల వినతి

రణస్థలం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఆక్రమించడం.. అడ్డగోలుగా ధ్రువపత్రాలు పొందడం.. ప్రభుత్వ భూమిని కైంకర్యం చేయడం పరిపాటిగా మారింది. చివరకు పొలాలకు సాగునీరు అందించే చెరువులు, వాగులను కూడా అక్రమార్కులు వదలడం లేదు. రణస్థలం మండలం వేల్పురాయిలో ఇలాంటి ఆక్రమణే వెలుగు చూసింది. గ్రామంలో పెద్ద చెరువుతో పాటు గెడ్డను సైతం కబ్జా చేసి తమ భూముల్లో కలుపుకొన్నారు కొందరు. ఏకంగా ఎనిమిది ఎకరాలను ఇలానే కలిపేశారు. సుమారు రూ.4 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు.

ఇదీ పరిస్థితి..

వేల్పురాయి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 77లో 28.90 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. దీని ఆయకట్టు 70 ఎకరాలు. పల్లంతో పాటు మెట్టు భూమి సాగుకు ఈ చెరువు ఎంతగానో దోహదపడేది. స్థానిక రైతులు తమ పశువులకు ఈ చెరువులోనే నీరు పెట్టడంతో పాటు వాటిని శుభ్రం చేసేవారు. ఈ ప్రాంతంలో ఆవులు, గొర్రెల మందలకు సైతం తాగునీరు అందించేందుకు వీలుగా ఈ చెరువు ఉండేది. అటువంటి చెరువు గర్భంపై కొంతమంది కన్నుపడింది. సుమారు 5 నుంచి 6 ఎకరాలను ఆక్రమించుకున్నారు. దీంతో చెరువు కుచించుకుపోతోంది. ఖరీఫ్‌లో శివారు ఆయకట్టుకు సాగునీరు సైతం అందడం లేదు. ఇప్పుడు మిగతా భూమిని సైతం కొల్లగొట్టేందుకు అక్రమార్కులు సిద్ధపడుతున్నారు. ఇక్కడ సెంటు ధర రూ.50 వేల వరకూ ఉంది. ఈ లెక్కన రూ.మూడు కోట్ల వరకూ ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. దీనిపై అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

గెడ్డలు సైతం..

చెరువులనే కాదు గెడ్డలను కూడా అక్రమార్కులు వదలడం లేదు. వేల్పురాయి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 88లో గెడ్డ ఉంది. 766 మీటర్ల పొడవు ఉన్న ఈ గెడ్డకు సంబంధించి 1.64 ఎకరాలు ఉండగా సుమారు 70 సెంట్లు వరకూ కబ్జా అయింది. సర్వే నంబర్‌ 89లో 779 మీటర్ల గెడ్డలో 2.29 ఎకరాలకు సుమారు 80 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో గెడ్డలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. కొన్నిచోట్ల గెడ్డ ఆనవాళ్లు కోల్పోతోంది. వేల్పురాయి రెవెన్యూ పరిధిలోని పెద్ద చెరువు, గెడ్డ కలిపి మొత్తం సుమారు 8 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోయింది. వీటి విలువ రూ.4కోట్ల వరకు ఉంటుంది. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టాలని రైతులు కోరుతున్నారు

అధికారులు చర్యలు తీసుకోవాలి

ఏకంగా చెరువు గర్భాన్ని ఆక్రమించేస్తున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందని దుస్థితి. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదుచేశాం. కానీ పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. సాగునీటి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు మిన్నకుండా ఉన్నారు. జిల్లా అధికారులు పట్టించుకోవాలి.

-బాలి రామినాయుడు, ఆయకట్టు రైతు, వేల్పురాయి

విచారణ చేపడతాం..

వేల్పురాయి పెద్ద చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే. సిబ్బందిని పంపించి విచారణ చేయిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమించడం నేరం. ప్రభుత్వ భూముల పరిరక్షణ అన్ని శాఖల బాధ్యత. మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని ఆక్రమణలను అరికడతాం.

-సనపల కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌, రణస్థలం

Updated Date - Jul 19 , 2026 | 12:24 AM