Share News

మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీక

ABN , Publish Date - May 20 , 2026 | 12:13 AM

‘In Service of Fishermen’ Scheme ‘‘కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద అందజేస్తున్న భృతి.. కేవలం సాయం కాదు. మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీక
మత్స్యకారులకు చెక్కును అందజేస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్యేలు

  • వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు

  • రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌/ కోటబొమ్మాళి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘‘కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద అందజేస్తున్న భృతి.. కేవలం సాయం కాదు. మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘వైసీపీ పాలనలో మత్స్యకారులకు కష్టాలే. వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా కింద కొంతమందికి రూ.10వేలు చొప్పున మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన హామీలు అమలుచేయలేదు. అప్పట్లో తెచ్చిన జీవో నెంబర్‌ 217 మత్య్సకారులకు ఉరితాడుగా మారింది. జగన్‌రెడ్డి నిర్వాకం కారణంగా దళారులు బాగుపడ్డారు. మత్స్యకారులకు ఉపాధి కరువైంద’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించాం. వేట నిషేధ భృతిని రూ.20వేలకు పెంచాం. సముద్రంలో మత్స్యసంపదను పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అధికశాతం మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా నిబంధనలు సడలించాం. ఈ ఏడాది 16,737 మంది మత్స్యకారులకు రూ.33.47కోట్లు జమచేశామ’ని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గతేడాది కన్నా ఈ ఏడాది అదనంగా రూ.28 కోట్లు అందజేశామన్నారు.

  • 16,737 మందికి రూ.33.47కోట్లు : ఇన్‌చార్జి కలెక్టర్‌

  • మత్స్యకారుల ఖాతాల్లో వేట నిషేధ భృతి జమైందని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద చెక్కు నమూనాను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మత్స్య సంపద అభివృద్ధి కోసం ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధికిగాను ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.20వేలు చొప్పున భృతి అందిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 16,737 మంది మత్స్యకారులకు రూ.33.47 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింద’ని తెలిపారు. కార్యక్రమంలో పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్‌, నడుకుదిటి ఈశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, మత్స్యశాఖ డీడీ గోపీకృష్ణ, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:13 AM