Share News

నే‘రెడీ’కి ముందడుగు

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:59 PM

Clear for the construction of Neredi Barrage సిక్కోలు రైతుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. జిల్లా సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసే వంశధార ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో నేరడి బ్యారేజీకి ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రం ఒడిశాతో ఉన్న ఇబ్బందులు, ట్రిబ్యునల్‌ తీర్పుల అమలు వంటి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని ప్రకటించారు. పనులకు సంబంధించి తక్షణమే టెండర్లు పిలవాలని జలవనరుల శాఖను ఆదేశించారు.

నే‘రెడీ’కి ముందడుగు
నేరడి బ్యారేజీ నిర్మించనున్న ప్రాంతం

  • బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం

  • టెండర్లకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

  • ఇక శరవేగంగా వంశధార పనులు

  • డిసెంబరు నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్‌

  • ఉత్తరాంధ్ర ఇతర ప్రాజెక్టులకూ జలకళ

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): సిక్కోలు రైతుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. జిల్లా సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసే వంశధార ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో నేరడి బ్యారేజీకి ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రం ఒడిశాతో ఉన్న ఇబ్బందులు, ట్రిబ్యునల్‌ తీర్పుల అమలు వంటి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని ప్రకటించారు. పనులకు సంబంధించి తక్షణమే టెండర్లు పిలవాలని జలవనరుల శాఖను ఆదేశించారు. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టనుంది. సీఎం ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు టెండర్ల ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. నేరడి బ్యారేజీ పాత డిజైన్లు, అప్పటి అంచనా వ్యయాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి(ఎస్‌ఎస్‌ఆర్‌), సత్వరమే టెండర్‌ షెడ్యూల్‌ విడుదలకు కసరత్తు ప్రారంభించనున్నారు. ఇక నిర్మాణ పనులకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవన్న భరోసా రైతుల్లో నెలకొంది.

  • మారనున్న ముఖచిత్రం...

  • వంశధార ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రానున్న ఆరు నెలలు జిల్లా జలవనరుల శాఖకు అత్యంత కీలకం కానున్నాయి. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 పూర్తి ప్రయోజనాలు సిక్కోలుకు అందాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం అత్యవసరం. ఏటా వర్షాకాలంలో లక్షలాది క్యూసెక్కుల వంశధార వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. నేరడి వద్ద బ్యారేజీ నిర్మిస్తే, ఆ వరదను సమర్థవంతంగా నిల్వ చేసి, కాలువల ద్వారా తరలించడానికి మార్గం సుగమమవుతుంది. ఇక్కడ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీటిని తరలించి, జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఫలితంగా ఖరీఫ్‌, రబీ సీజన్లలో చివరి ఆయకట్టు రైతులకూ సాగునీటి కొరత తీరుతుంది.

  • ఇతర ప్రాజెక్టులకూ జలకళ ..

  • వంశధారపైనే కాకుండా, జిల్లాలోని ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నాగావళి - చంపావతి నదుల అనుసంధాన ప్రక్రియను వచ్చే జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఉత్తరాంధ్రకు మరో శుభవార్త. దీనికితోడు తారకరామతీర్థ సాగర్‌, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజీ, మడ్డువలస, జంఝావతి ప్రాజెక్టులతోపాటు హిరమండలం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్లోనూ వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా సమీక్షతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమైందని.. అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. పనులు ప్రారంభిస్తే తమకు సాగునీటి కష్టాలు తీరనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:59 PM