Share News

ఆదుకోవాల్సిన కొడుకు అనంత లోకాలకు...

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:35 PM

ఆదుకుంటాడని ఆశించిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 ఆదుకోవాల్సిన కొడుకు అనంత లోకాలకు...
జగదీష్‌ (ఫైల్‌)

- రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

టెక్కలి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆదుకుంటాడని ఆశించిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఇక దిక్కెవరిని దీనంగా రోదిస్తున్నారు. ఇదీ సంతబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి జగదీష్‌ విషాదాంతం. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... కర్రి జగదీష్‌(19) బైక్‌పై వెళుతూ మంగళవారం జాతీయ రహదారి అక్కవరం సమీపంలో లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి... హైవే అంబులెన్స్‌ ద్వారా గాయపడిన జగదీష్‌ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జగదీష్‌ టెక్కలికి సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో జగదీష్‌ దుర్మరణం పాలయ్యాడని తండ్రి అప్పారావు, తల్లి కన్నమ్మలకు సమాచారం అందడంతో ఒక్కసారిగా వారు కుప్పకూలారు. ప్రయోజకుడై తమను ఆదుకుంటాడని భావించిన కుమారుడు అర్థాంతరంగా ఇలా విడిచిపెట్టి వెళ్లిపోతాడని అనుకోలేదంటూ వారు విలపిస్తున్నారు. ఈ మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. జగదీష్‌ మృతి పట్ల కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 23 , 2026 | 11:35 PM