చెత్త.. కొత్తగా..
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:06 AM
Garbage problem in municipality చెత్త నుంచి సైతం సంపద సృష్టించేలా ప్రభుత్వం పలుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, సిబ్బంది కొరత, చెత్త వినియోగంపై కొంతమందికి అవగాహన లేక చెత్తసంపద కేంద్రాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది.
మునిసిపాలిటీల్లో చెత్త సమస్యకు పరిష్కార మార్గం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్రెష్ వేస్ట్‌ప్లాంట్ నిర్మాణానికి చర్యలు
పలాస, మార్చి 27(ఆంధ్రజ్యోతి): చెత్త నుంచి సైతం సంపద సృష్టించేలా ప్రభుత్వం పలుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, సిబ్బంది కొరత, చెత్త వినియోగంపై కొంతమందికి అవగాహన లేక చెత్తసంపద కేంద్రాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్రెష్ వేస్ట్‌ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. పోగవుతున్న చెత్తను వివిధ రూపాల్లో ఈ ప్లాంట్‌కు తరలించడానికి అంగీకారం కుదిరింది. దీంతో కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో చెత్త సమస్యకు చెక్ పడనుంది.
జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిపాలిటీలు ఉన్నాయి. మొత్తం అన్నీ మునిసిపాలిటీల్లో రోజూ 300 టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. చెత్తను వేరుచేసి సంపద సృష్టించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా సిబ్బంది లేకపోవడం, వాటిని ఏ విధంగా వినియోగించాలో తెలియకపోవడంతో చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. ఉదాహరణకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో రోజూ 35 టన్నుల వరకూ చెత్త వస్తుంది. దీన్ని డంపింగ్ యార్డులో నిల్వ చేస్తున్నారు. 11 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఉన్నా అది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట విశాఖపట్నం దగ్గరలో జిందాల్ సంస్థ.. చెత్త నుంచి వినియోగపడే వస్తువులు సేకరించి మిగిలిన మట్టిని తోటల్లో వేయడానికి చర్యలు చేపట్టింది. మంచి ఫలితాలు ఇస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. దీంతో చెత్త కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దీనికి శాశ్వత పరిష్కారం చూపించడానికి చొరవ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సంస్థ ఆధ్వర్యంలో మునిసిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనుంది. డంపింగ్ యార్డు ప్రాంతంలో 1.6 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి భారీ యంత్రాల ద్వారా వచ్చిన చెత్తను నేరుగా అందులో వేయనుంది. వాటి నుంచి వినియోగపడే ప్లాస్టిక్, ఐరన్ తీయడం, తడి-పొడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడం, మిగిలిన వ్యర్థ పదార్థాలను పంట పొలాలకు వినియోగపడేలా తయారు చేయడానికి సంకల్పించింది. వాటిద్వారా వచ్చిన ఆదాయంలో కొంతభాగాన్ని మునిసిపాలిటీల అభివృద్ధికి కేటాయించనుంది. ప్రతి మునిసిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో కనీసం 1.6 ఎకరాల స్థలాలు ఇవ్వాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కమిషనర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు మునిసిపాలిటీల వారీగా స్థలాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మరో మూడు నెలల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిబ్బంది మునిసిపాలిటీల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
వ్యర్థాల ద్వారా ఆదాయమే
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సభ్యులు ఇప్పటికే చెత్తనుంచి సంపద తయారు చేయడానికి స్థలాలు ఇవ్వాలని అడిగారు. పెంటిబధ్ర సబ్‌డివిజన్‌లో ఉన్న డంపింగ్ యార్డులో స్థలాలు వారికి కేటాయించాం. వారు నిత్యం సేకరించిన చెత్త నుంచి వ్యర్థాలను వివిధ కంపెనీలకు తరలిస్తారు. వారికి వచ్చిన ఆదాయంలో కొంతభాగం మునిసిపాలిటీల అభివృద్ధికి ఇస్తారు. దీంతో వ్యర్థాల నుంచి కూడా మునిసిపాలిటీకి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఇ.శ్రీనివాసులు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ