Share News

భక్తజన సంద్రం.. ఆదిత్యాలయం

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:19 AM

సూర్యనారాయణ స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తజన సంద్రం.. ఆదిత్యాలయం
భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు

- ఒక్కరోజు ఆదాయం రూ.8.99లక్షలు

అరసవల్లి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సూర్యనారాయణ స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు, నిత్యాన్నదాన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. ఇంద్రపుష్కరిణి వద్ద గల రావిచెట్టు వద్ద భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి, వడపప్పు ప్రసాదాలు సమర్పించి పూజలు చేశారు. అన్నదాన క్యూలైన్లు ఉదయం 11 గంటల నుంచే భక్తులతో నిండిపోయాయి. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి రూ.8,99,007 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.4,34,400, విరాళాల రూపంలో రూ.68,202, ప్రసాదాల రూపంలో రూ.1,68,850, ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.2,27,655 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 12:19 AM