Share News

ఆ నలుగురికి పావలా వాటా!

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:10 AM

Locals have a stake in the card game club ఒడిశాలోని పేకాట క్లబ్‌తో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గజపతి జిల్లా పర్లాకిమిడి సమీపంలోని అనుమతులు లేని స్టార్‌ రిక్రియేషన్‌ కల్చరల్‌ క్లబ్‌పై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 71 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 44 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా, 20 మంది శ్రీకాకుళం పట్టణానికి చెందిన ప్రముఖులు ఉన్నట్టు తెలిసింది.

ఆ నలుగురికి పావలా వాటా!

ఒడిశా పేకాట క్లబ్‌లో జిల్లా వాసులకు భాగం

పట్టుబడిన 71 మందికి 14 రోజుల రిమాండ్‌

క్లబ్‌లో 44 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు..

వారిలో 20 మంది పట్టణ ప్రముఖులు

శ్రీకాకుళం కైరం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని పేకాట క్లబ్‌తో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గజపతి జిల్లా పర్లాకిమిడి సమీపంలోని అనుమతులు లేని స్టార్‌ రిక్రియేషన్‌ కల్చరల్‌ క్లబ్‌పై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 71 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 44 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా, 20 మంది శ్రీకాకుళం పట్టణానికి చెందిన ప్రముఖులు ఉన్నట్టు తెలిసింది. పట్టణానికి చెందిన నలుగురికి క్లబ్‌లో పావలా వాటా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురి ఆధ్వర్యంలోనే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ ఆరు నుంచి ఏడు కార్లలో 60 నుంచి 70 మంది పేకాట ఆడేందుకు క్లబ్‌కు వెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా, గజపతి జిల్లా ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు సమాచారం.

అప్పులపాలవుతున్న జూదరులు

పేకాట వ్యసనంతో పలువురు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధిక వడ్డీలకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక జిల్లా విడిచి వెళ్లిపోతున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు, క్లబ్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖులు ఉన్నారన్న సమాచారంతో వారిని పరామర్శించేందుకు శ్రీకాకుళం నుంచి పలువురు కార్లలో వెళ్లినట్టు తెలిసింది.

అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టాలి

ఒడిశాలోని పేకాట క్లబ్‌లకు, సూటు ఆటల పేరుతో నిర్వహిస్తున్న జూద కార్యకలాపాలకు శ్రీకాకుళం నుంచి వ్యక్తులను తరలిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. క్లబ్‌ నిర్వాహకులతో పాటు పేకాట ఆడేందుకు వ్యక్తులను సమీకరించి తరలిస్తున్న వారి పాత్రపైనా సమగ్ర విచారణ జరిపి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:10 AM