‘ఉపాధి’కి కొత్త రూపు
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:03 AM
Gram Sabhas across the district today మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపుమారుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా సోమవారం గ్రామసభలు నిర్వహించనుంది.
నేడు జిల్లావ్యాప్తంగా గ్రామసభలు
వీబీజీ- రామ్ జీగా పథకం పేరు మార్పు
పనిదినాలు 100 నుంచి 125కు పెంపు
ప్రజలకు అవగాహన కల్పించనున్న అధికారులు
కోటబొమ్మాళి/ సంతబొమ్మాళి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపుమారుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా సోమవారం గ్రామసభలు నిర్వహించనుంది. జిల్లాలోని 912 పంచాయతీల్లో 7లక్షల 20వేల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5 లక్షల 86వేల మంది ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. వీరిలో 5,73,744 మంది కొత్తగా ఉపాధి హామీలో ప్రవేశపెట్టిన ఈకేవీసీని పూర్తి చేసుకున్నారు. ఈ పథకాన్ని వీబీ జీ-రామ్ జీగా మార్చిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ఈ పథకంలో మార్పులను అధికారులు వివరించనున్నారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో కార్యదర్శులు గ్రామసభలు నిర్వహిస్తారు. ప్రజలు, వేతనదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గ్రామసభల్లో ప్రధాన అంశాలను వివరిస్తారు.
అదనపు ఆదాయం
మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రతి వేతనదారుడికీ 100 రోజుల పని దినాలు కల్పించేవారు. ప్రస్తుతం పని దినాలను 125 రోజులకు పెంచనున్నారు. దీంతో శ్రమజీవులకు అదనపు ఆదాయం లభించనుంది. నిర్వహణ వ్యయం 6 నుంచి 9 శాతానికి పెరగనుంది. ఇప్పటి వరకూ కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వ్యయం భరిస్తూ వస్తున్నాయి. కానీ ఇక నుంచి కేంద్రం 60, రాష్ట్రం 40 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం కారణంగా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడుతోందని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఖరీఫ్‌లో 2 నెలల పాటు పనులకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆలస్యమైతే పరిహారం
వలసల నియంత్రణ కోసం చేపడుతున్న ఈ పథకంలో ఎవరైనా అర్హులు పని కావాలంటే 14 రోజుల్లో అవకాశం కల్పించాలి. లేదంటే సహేతుకమైన కారణం ఉండాలి. అలా చేయకుంటే సంబంధిత సిబ్బంది జీతాల్లో కోత విధించి వేతనదారులకు చెల్లిస్తారు. వివిధ కారణాలతో వేతనదారులకు చెల్లింపులో ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా పెరగడంతో పర్యవేక్షణ ఆ స్థాయిలోనే ఉంటుంది.
వీటికి ప్రాధాన్యం
నాలుగు అంశాలకు సంబంధించి పనులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. జలసంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, జీవనోపాధుల కల్పన, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు చేపడతారు. గ్రామాల అభివృద్ధి ఎక్కువగా ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడి ఉంటోంది. అందులో భాగంగా కొత్తగా 266 పనులు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం... పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం ఈ నిధులతోనే చేపట్టనున్నారు. బంజరు, బీడు భూముల్లో పండ్ల తోటలు, మొక్కల పెంపకంతో పాటు పండ్ల తోటలు, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ఈ కొత్త పథకం ద్వారా నిధులు మంజూరుకానున్నాయి.
గ్రామ సభలకు ఏర్పాట్లు
ఉపాధి పథకంలో మార్పులకు సంబంధించి ప్రజలు, వేతనదారులకు అవగాహన కల్పించేందుకు సోమవారం పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా గ్రామసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వేతనదారులకు, ప్రజలకు సమాచారం అందిస్తున్నాం.
- పంగ నర్సింహమూర్తి, ఏపీవో, సంతబొమ్మాళి