త్రుటిలో తప్పిన ముప్పు
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:10 AM
Ambulance crashes into electric pole శ్రీకాకుళం మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ అంబులెన్స్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అద్దాలు పగులకొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆహుతైన అంబులెన్స్
అద్దాలు పగులకొట్టి బయటపడిన డ్రైవర్
శ్రీకాకుళం క్రైం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ అంబులెన్స్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అద్దాలు పగులకొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో అంబులెన్స్‌లో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాగోలు జెమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాన్ని అంబులెన్స్ (ఏపీ 39యుఎఫ్ 5098) ఢీకొంది. హైటెన్షన్ వైర్లు అంబులెన్స్‌పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అంబులెన్స్ డ్రైవర్ రమా ప్రవీణ్‌కుమార్ అప్రమత్తమై అద్దాలు పగులకొట్టి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో అంబులెన్స్‌కు అంటుకున్న మంటలను అదుపు చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో డ్రైవర్ తప్ప అంబులెన్స్‌లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అలాగే విద్యుత్ వైర్లు నేలపడిన సమయంలో కూడా అటువైపు ప్రజల రాకపోకలు లేకపోవడంతో ముప్పు తప్పిందని ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తెలిపారు.