‘కొండ’ంత దోపిడీ!
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:39 PM
Gravel excavations in Hiramandalam హిరమండలంలోని కొండలపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తుంగతంపర రెవెన్యూ పరిధిలోని వంశధార నదికి ఆనుకుని 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపై కొద్దిరోజులుగా అనుమతులు లేకుండా కంకర తవ్వేస్తున్నారు. కరకట్టల నిర్మాణ పనుల పేరిట అక్రమ రవాణా సాగిస్తున్నారు.
హిరమండలంలో అడ్డగోలుగా కంకర తవ్వకాలు
వంశధార కరకట్టల నిర్మాణం పేరుతో అక్రమాలు
పట్టించుకోని అధికారులు
హిరమండలం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):
సహజ వనరులను అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వన్యప్రాణులకు ఆసరాగా ఉన్న కొండలను సైతం ధ్వంసం చేస్తున్నారు. వంశధార కరకట్టల నిర్మాణ పనుల పేరిట.. అనుమతి లేకుండా కంకర (గ్రావెల్) తవ్వేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల టిప్పర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
హిరమండలంలోని కొండలపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తుంగతంపర రెవెన్యూ పరిధిలోని వంశధార నదికి ఆనుకుని 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపై కొద్దిరోజులుగా అనుమతులు లేకుండా కంకర తవ్వేస్తున్నారు. కరకట్టల నిర్మాణ పనుల పేరిట అక్రమ రవాణా సాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను నిలిపేశారు. ఇటీవల ఈ పనులు మళ్లీ చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాంట్రాక్టర్ పనులు పునఃప్రారంభించారు. వంశధార నదికి కుడివైపున హిరమండలం మండలం గులుమూరు నుంచి ఎల్.ఎన్.పేట మండలం స్కాట్ పేట వరకు పనులు చేపట్టనున్నారు. అలాగే ఎడమవైపున రుగడ నుంచి జలుమూరు మండలం శ్రీముఖలింగం వరకు కరకట్టలు నిర్మించనున్నారు. వీటికి అవసరమైన కంకరను అనుమతులు లేకుండా ఈ కొండపై యంత్రాలతో తవ్వి.. టిప్పర్లతో తరలిస్తున్నారు. పట్టపగలే అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నా గనులశాఖ, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెల్తుతున్నాయి.
అనుమతి లేకుండా ఎలా?
కొండను తవ్వి పెద్దఎత్తున కంకరను తరలించాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. గ్రావెల్ క్వారీ ఏర్పాటుకు మైనింగ్ శాఖకు, కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారులు వెళ్లి కొండను పరిశీలిస్తారు. ఈ నివేదిక మేరకు మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో కొండ వద్దకు వెళ్లి సర్వే చేస్తారు. క్వారీ ఏర్పాటుకు అనువైనదా? లేదా? అని పరిశీలిస్తారు. సాంకేతిక, పర్యావరణ సమస్యలు కూడా చూస్తారు. వారి నివేదిక మేరకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు వస్తాయి. కాగా ఈ కొండ నుంచి కంకర తరలించేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేవు. అనుమతుల విషయమై కాంట్రాక్టర్ వద్ద ప్రస్తావించగా.. దరఖాస్తు చేశామని చెబుతున్నారు.
నాకు తెలియదు
ఈ విషయమై తహసీల్దార్ బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా.. ‘తుంగతంపర రెవెన్యూ పరిధిలో కొండపై కంకర తవ్వకాల విషయం నాకు తెలియదు. కంకర క్వారీ నిర్వహణకు ఎటువంటి దరఖాస్తు అందలేద’ని తెలిపారు. దీనిపై ఆయన సర్వేయర్‌ను ప్రశ్నించగా వీఆర్వోకు దరఖాస్తు ఇచ్చారని చెప్పారు. కాగా తహసీల్దార్‌కు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున కంకర క్వారీ నిర్వహణకు సంబంధించి వీఆర్వోకు దరఖాస్తు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కంకర అక్రమ తవ్వకాలకు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
సొంటినూరు కొండల్లో..
టెక్కలి, నందిగాం మండలాల సరిహద్దున సొంటినూరు కొండల్లో కంకర అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు మండలాలకు చెందిన పలువురు ఇక్కడ కంకరను తవ్వి.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో పగలు, రాత్రీ కంకర తవ్వకాలు చేపడుతూ.. కొండను కొల్లగొడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గనులశాఖ ఏడీ విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా.. సొంటినూరు కొండల్లో కంకర అక్రమ తవ్వకాలు ఎవరైనా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ ప్రాంతంపై నిఘా ఉంచుతామని తెలిపారు.