అమ్మ మరణశాసనం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:02 AM
Rising number of suicides in the srikakulam కొంతమంది అమ్మలు.. తాము ఆత్మహత్య చేసుకోవడమే కాదు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు సైతం మరణశాసనం అమలు చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను క్షణికావేశంతో కడతేర్చుతున్నారు. కుటుంబ పరిస్థితులతో తల్లడిల్లిపోయి.. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
తాము చనిపోతూ పిల్లలను సైతం..
జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు
5 నెలల వ్యవధిలో మూడు ఘటనలు
కుటుంబ కలహాలతోనే అధికం
రణస్థలం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది జూన్ 19న పలాస రైల్వేస్టేషన్ సమీపంలో కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజిత, తన ఇద్దరు పిల్లలు కుశ్వంత్(7), దీక్షిత(4)తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురై అఘాయిత్యం చేసుకుంది. తనతోపాటు తన ఇద్దరి పిల్లల జీవితాలను కూడా చిదిమేసింది.
ఈ ఏడాది జూన్ 30న ఆమదావలస మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులు (3 ఏళ్లు), చాందిని(4 నెలల) గొంతులను కోసి చంపేసింది. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. భార్యభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసింది.
తాజాగా ఈ నెల 6న ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన తోణంగి మీనా అనే మహిళ ఇద్దరు పిల్లలకు గడ్డి మందు ఇచ్చి.. తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మీనాతోపాటు 8 నెలల కుమారుడు కులదీప్ మృతిచెందారు. రెండున్నరేళ్ల కుమార్తె గాయత్రి కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.
ఇలా కొంతమంది అమ్మలు.. తాము ఆత్మహత్య చేసుకోవడమే కాదు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు సైతం మరణశాసనం అమలు చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను క్షణికావేశంతో కడతేర్చుతున్నారు. కుటుంబ పరిస్థితులతో తల్లడిల్లిపోయి.. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లోనే ఇటువంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. క్షణికావేశం నుంచి మనసును కొద్దిసేపు మళ్లించగలిగితే మాత్రం ఆత్మహత్యలను అదుపులోకి తీసుకురావచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ కారణాలతోనే..
ఆత్మహత్యలకు 44శాతం కుటుంబ కలహాలే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఆస్తి వివాదాలు, దంపతుల మధ్య సమస్యలు, రెండో వివాహం.. ఇలా పలు కారణాలతో పిల్లలతోపాటు తల్లులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలున్న వారిలో కొంతమంది పసిపిల్లలని కూడా చూడకుండా వారితో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 18 శాతం వరకూ ఇటువంటి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలామంది అనవసర విషయాలకు ఆందోళనకు గురవుతుంటారు. లేనిపోని అపోహలు పెట్టుకుంటారు. మరికొందరు డిప్రెషన్, వ్యసనాలు, సోషల్ మీడియాకు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోరు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండే భార్య జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంటుంది. అటువంటివారు తాము చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకోరని భావించి వారికి సైతం మరణ శాసనం రాస్తుంటారు. కాగా.. ప్రతిఒక్కరి జీవితంలోనూ కష్టాలు సహజం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. చావు ఒక్కటే శరణ్యం భావించి బలవన్మరణాలకు పాల్పడకుండా.. సమస్యలకు పరిష్కారం అన్వేషించాలని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘కుటుంబంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పడు కుటుంబసభ్యులంతా దానిపై చర్చించాలి. మానసిక పరిస్థితి బాగోలేనివారిపై ఆదరణ చూపాలి. అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. చావు అన్ని సమస్యలకు పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తించాల’ని శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ మానసిక వైద్య నిపుణుడు తెలిపారు.