తెల్లారిన వలస బతుకు
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:03 AM
Fisherman dies in Karnataka ఉపాధి కోసం వలస వెళ్తున్న మత్స్యకారుల జీవితానికి భద్రత ఉండటం లేదు. అక్కడ పడరానిపాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకుగురై కొంతమంది విగతజీవులుగా మారి.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు.
కర్ణాటకలో జిల్లా మత్స్యకారుడు మృతి
బోటు బోల్తాపడి ప్రమాదం
బడివానిపేట గ్రామంలో విషాదం
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం వలస వెళ్తున్న మత్స్యకారుల జీవితానికి భద్రత ఉండటం లేదు. అక్కడ పడరానిపాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకుగురై కొంతమంది విగతజీవులుగా మారి.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన వారధి మహందాత (52).. కర్ణాటక రాష్ట్రంలో బోటు ప్రమాదంలో మృతిచెందారు. ఈయన ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వెళ్లారు. చేపలవేట కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. గురువారం ఏడుగురు మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపలవేటకు వెళ్లగా.. వేకువజామున 5 గంటల సమయంలో అలల ఉధృతికి బోటు బోల్తాపడింది. దీంతో మహందాత తీవ్రంగా గాయపడ్డారు. తోటి మత్స్యకారులు బోటు సరిచేసి ఆయనను ఒడ్డుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఫోన్ ద్వారా ఈ సమాచారం తెలిసి.. కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. మహందాత భార్య పొలమ్మ గృహిణి కాగా, కుమారుడు నారాయుడు స్థానికంగా చేపలవేట సాగిస్తున్నాడు. ఈ గ్రామా నికి చెందిన సుమారు 150 మంది మంగుళూరులో చేపలు వేట కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మహందాత మృతదేహాన్ని బడివానిపేట తీసుకువస్తున్నట్టు తోటి మత్స్యకారులు తెలిపారు.