వలస బతుకు.. కన్నీటి ముగింపు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:04 AM
Native of Kapugodayavalasa dies in Poland జీవనోపాధి కోసం కొన్నాళ్ల కిందట విదేశాలకు వెళ్లిన ఓ తండ్రి.. తన రెండో బిడ్డను కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలసకు చెందిన బత్సల రాంబాబు(37) పోలాండ్‌లో గుండెపోటుతో మృతి చెందారు.
పోలాండ్‌లో కాపుగోదాయవలస వాసి మృతి
జీవనోపాధికి గత ఏడాది నవంబరులో వలస
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. భవిష్యత్తుపై కోటి ఆశలతో, పిల్లల కోసం కాస్త వెనుకేద్దామని సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లాడా తండ్రి. ఏడు నెలల క్రితం రెండో కూతురు పుట్టింది. ఏడాది తర్వాత ఊరికి వెళ్లి.. తన గారాలపట్టిని కళ్లారా చూసి.. గుండెలకు హత్తుకోవాలని కలలు కన్నాడు. అయితే కాలం కనికరించలేదు. పరాయి దేశంలోనే అనారోగ్యంతో కన్ను మూశాడు. దీంతో ఇక్కడ భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు.
సంతబొమ్మాళి, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): జీవనోపాధి కోసం కొన్నాళ్ల కిందట విదేశాలకు వెళ్లిన ఓ తండ్రి.. తన రెండో బిడ్డను కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలసకు చెందిన బత్సల రాంబాబు(37) పోలాండ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధి కోసం రాంబాబు గతేడాది నవంబరులో పోలాండ్ దేశం వెళ్లాడు. ఆ సమయంలో భార్య లావణ్య గర్భిణి. అంతకుముందు ఈ దంపతులకు ఒక కుమార్తె బిందుశ్రీ ఉంది. ఈ ఏడాది జనవరిలో రెండో కుమార్తె చరిష్మా జన్మించింది. ఈ విషయం ఫోన్ ద్వారా తెలిసి రాంబాబు ఎంతో ఆనందించాడు. కానీ ముందస్తు ఒప్పందం ప్రకారం పోలాండ్ నుంచి వచ్చేందుకు రెండేళ్ల వరకు అనుమతి లేకపోవడంతో.. స్వగ్రామానికి వచ్చి చిన్న కుమార్తెను చూసుకోలేకపోయాడు. కాగా.. రాంబాబు అనారోగ్యంతో మృతి చెందినట్లు సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రెండో కుమార్తెను చూడకుండానే కన్నుమూశాడని.. బిడ్డను ఒక్కసారైనా ఎత్తుకుని ముద్దాడాలన్న తండ్రి కోరిక తీరలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని, ఇద్దరు కుమార్తెలతో ఎలా జీవనం సాగించాలని లావణ్య విలపిస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చొరవ చూపాలని సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు కుత్తుమ శివప్రకుమార్, గ్రామస్థులు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకి విజ్ఞప్తి చేశారు.