పావలా వడ్డీకే రూ.లక్ష రుణం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:39 PM
Dwakra new schemes for women డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. స్వయంశక్తి సంఘాల్లోని మహిళల పిల్లల విద్య కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మీతోపాటు కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకాలు ప్రవేశపెట్టనుంది.
డ్వాక్రా మహిళలకు వరాల జల్లు
పిల్లల చదువుకు విద్యాలక్ష్మీ.. పెళ్లికి కళ్యాణలక్ష్మీ
ఈ నెల 8న కొత్త పథకాలు ప్రారంభం
సంతబొమ్మాళి/ మెళియాపుట్టి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. స్వయంశక్తి సంఘాల్లోని మహిళల పిల్లల విద్య కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మీతోపాటు కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకాలు ప్రవేశపెట్టనుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ఈ రెండు పథకాలు ప్రారంభించనుంది. కేవలం పావలా(నాలుగు శాతం) వడ్డీతో అర్హతను బట్టి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందజేయనుంది. కనీసం ఆరు నెలల కిందట డ్వాక్రా సంఘంలో చేరి.. గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన వారికే ప్రాధాన్యమివ్వనుంది. రుణగ్రహీత ప్రమాదవశాత్తు మరణిస్తే.. రుణం మాఫీ చేయనుంది. జిల్లాలో 48,906 మహిళా సంఘాల్లో 5,37,133 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ అవసరం మేరకు ఈ పథకాల ద్వారా లబ్ది చేకూరనుంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ : ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తమ పిల్లల చదువు కోసం రుణం పొందవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందజేస్తారు. దీనికి సంబంధించి పిల్లలు పాఠశాల లేదా కళాశాలల్లో ప్రవేశ పత్రాలు, ఫీజు చెల్లింపు రశీదులు సమర్పించాలి. తీసుకునే రుణాన్ని సుమారు 48 వాయిదాల్లో చెల్లించాలి.
ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ : ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ కుటుంబంలో 18 ఏళ్లు దాటి.. వివాహం చేసుకోనున్న కుమార్తెకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రుణం అందజేస్తారు. పెళ్లి శుభలేఖతోపాటు ఖర్చుల అంచనా వివరాలు సమర్పించాలి. దరఖాస్తు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు. రుణం తీర్చేందుకు నాలుగేళ్లు వరకు గడువు ఇస్తారు.
విధివిధానాలు రావాలి
మహిళ దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న డ్వాక్రా మహిళల కోసం విద్యాలక్ష్మీ, కళ్యాణ లక్ష్మీ పఽథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పధకాలు డ్వాక్రా మహిళలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ పథకాల అమలుకు సంబంధిం విధివిధానాలు రావాల్సి ఉంది.
- జి.శ్రీనివాసరావు, ఏపీయం, వెలుగు, సంతబొమ్మాళి
ఎంతో ఆనందం
పావలా వడ్డీకి రుణం వస్తే ఎంతో ఆనందం. నాకు ఇద్దరు కుమార్తెలు. భర్త లేకపోవడంతో వారి ఉన్నత చదువులు కష్టం అవుతోంది. విద్యాలక్ష్మి పథకం ద్వారా రుణం మంజూరు చేస్తే వారిద్దరి ఉన్నత చదువులకు డబ్బులు వినియోగిస్తాను.
- సింగుపురం. కుమారి, జగన్నాథపురం, మెళియాపుట్టి