Share News

కిలో చికెన్‌ రూ.380

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:05 AM

Increased chicken prices జిల్లాలో మాంసం ప్రియులకు షాక్‌ తగిలింది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్‌.. ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది.

కిలో చికెన్‌ రూ.380

  • ఒక్కసారిగా పెరిగిన ధరలు

  • కోడిగుడ్ల ధరలు మాత్రం పతనం

  • గణనీయంగా తగ్గిన అమ్మకాలు

  • ఎండల దెబ్బకు కోళ్ల కొరత

  • ఫౌల్ర్టీ పరిశ్రమపై ప్రభావం

  • ఇచ్ఛాపురం/ కోటబొమ్మాళి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాంసం ప్రియులకు షాక్‌ తగిలింది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్‌.. ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది. ఎండల తీవ్రత వల్ల మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడి చికెన్‌ ధర అమాంతం పెరిగింది. కిలో మాంసం రూ.400 వరకూ దూసుకెళుతోంది. గత జనవరిలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ. 200 మధ్య ఉండేది. ప్రస్తుతం బ్రాయిలర్‌ కిలో చికెన్‌ ధర రూ.360 ఉండగా.. స్కిన్‌లెస్‌ రూ.380 కు చేరుకుంది. మున్ముందు ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. వేసవి ఎండల తీవ్రతతో కోళ్లు చనిపోవడం, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు ఇతర ప్రాంతాలకు ఎగుమతి నిలిచిపోవడంతో కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. 100 గుడ్ల ధర రూ.420గా నిర్ధారించారు. దీంతో ఒక్కో గుడ్డును రూ.4 నుంచి రూ.5 వరకూ విక్రయిస్తున్నారు. యుద్ధం పేరు చెప్పి కోడిగుడ్లు ధరలు తగ్గగా.. కోడి మాంసం ధర మాత్రం రెండు వారాల వ్యవధిలోనే రూ.120 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే జిల్లాలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేక ఒడిశా నుంచి కోళ్లు తెప్పిస్తుండడం తదితర కారణాలతో చికెన్‌ ధర పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. వేసవిలో గ్రామదేవత పండగలు, జాతరలు జరగనున్న నేపథ్యంలో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

  • తగ్గిన విక్రయాలు..

  • సాధారణంగా జిల్లాలో వారానికి మూడు లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రముఖ కంపెనీలకు చెందిన హేచరీల నుంచి 1.60 లక్షల కిలోల మాత్రమే సరఫరా అవుతోంది. ధర పెరగడంతో విక్రయాలు తగ్గిపోయాయని చెబుతున్నారు. సాధారణంగా ఆది, మంగళవారాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. విక్రయాలు భారీగా ఉంటాయి. కానీ గత రెండు వారాలుగా విక్రయాలు పడిపోయాయి. జిల్లాలో కోళ్లఫారాల నుంచి సరఫరా తగ్గిపోయింది. విశాఖ జిల్లా శొంఠ్యాం, విజయనగరం జిల్లా కొత్తవలస జోన్‌లో ఇటీవల వైరస్‌ సోకి లక్షల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

  • తగ్గుతున్న ఫారాలు..

  • జిల్లాలో కోళ్లఫారాలు తగ్గుముఖం పడుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టు కోళ్ల సరఫరా లేదు. ఇటీవల సోకిన బర్డ్‌ఫ్లూ వ్యాధి, తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్లఫారాల నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా కోళ్లఫారాలను తగ్గించారు. వాస్తవానికి కోళ్లఫారంలో రెండు కిలోల వరకూ కోడిని పెంచాలంటే ఆహారం, ఇతరత్రా అవసరాలకు రూ.200 వరకూ ఖర్చవుతుంది. 10 వేల కోళ్లు పెంచే ఫారంలో అనారోగ్యంతో 2,500 వరకూ చనిపోతున్నాయని ఫారం రైతులు చెబుతున్నారు. కోళ్ల కంపెనీల ట్రేడర్స్‌ సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తుండటంతో వినియోగదారులకు, నిర్వాహకులకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు. ధర పెరిగినా.. కొనుగోళ్లు తగ్గడంతో తమకు ప్రయోజనం లేకపోతోందని చెబుతున్నారు.

  • హోల్‌సేల్‌ ధరలకు విక్రయిస్తున్నాం

  • కోళ్ల కొరత కారణంగానే ధరలు పెరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ఇబ్బంది పడకుండా హోల్‌సేల్‌ ధరలకు విక్రయిస్తున్నాం. ధరలు తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. వినియోగదారులు సహకరించాలి.

    - దుప్పల ఆనందరావు, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు, కోటబొమ్మాళి

  • కొనలేం.... తినలేం... :

  • మటన్‌, చికెన్‌ ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నాన్‌వెజ్‌ తినడం బాగా తగ్గించాం. జాతర్ల సీజన్‌ వస్తోంది. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.

    - మెట్ట కృష్ణారావు, వినియోగదారుడు, లఖందిడ్డి

Updated Date - Mar 26 , 2026 | 12:05 AM