హెల్మెట్ భారం కాదు.. బాధ్యత
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:48 PM
Helmet banks for the first time ‘హెల్మెట్ ధరించడం భారం కాదని... ప్రతి వాహనదారుడి బాధ్యత’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం అభయం పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
జిల్లాలో తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ‘హెల్మెట్ ధరించడం భారం కాదని... ప్రతి వాహనదారుడి బాధ్యత’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం అభయం పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ముఖ్య అతిఽథులుగా హాజరై ర్యాలీను ప్రారంభించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ రామలక్ష్మణ కూడలి నుంచి సూర్యమహల్ జంక్షన్ మీదుగా అరసవల్లి జంక్షన్ వరకు సాగింది. అభయం హెల్మెట్ బ్యాంక్‌ను ప్రారంభించి పోస్టర్, అభయం యాప్‌ను ఆవిష్కరించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి హెల్మెట్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే. విలువైన వాహనాలు కొనుగోలు చేసి తక్కువ ధరలో లభించే హెల్మెట్ విషయంలో నిర్లక్ష్యం చూపరాదు. హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి. రోడ్డు భ ద్రతా నియమాలు పాటిస్తూ శ్రీకాకుళం నగరాన్ని సురక్షిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలి. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అతివేగం, ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అలవాట్లు మానుకోవాల’ని సూచించారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరం. శ్రీకాకుళంలో సుమారు రెండు లక్షల వాహనాలు ఉన్నప్పటికీ వాటిలో సుమారు ఐదుశాతం మంది హెల్మెట్‌ను వినియోగించడం గుర్తించాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాహనాలు నడిపేవారికి హెల్మెట్ బ్యాంకు ద్వారా తాత్కాలికంగా హెల్మెట్ అందజేసి వారి వివరాలు నమోదు చేస్తాం. వారు హెల్మెట్ కనుగోలు చేసిన తర్వాత నిర్దిష్ట కాలంలో తిరిగి అందజేసే విధానాన్ని అమలు చేస్తాం. మిల్లు జంక్షన్, డేఅండ్‌నైట్ ప్రాంతం, బలగ ప్రాంతాల్లో తొలిదశలో హెల్మెట్ బ్యాంకులను ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతతో హెల్మెట్ ధరించాల’ని తెలిపారు. జేసీ మాట్లాడుతూ.. రోడ్డుభద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి.. వాహనాలను నడపాలన్నారు. అనంతరం అభయం రోడ్డు భద్రత హెల్మెట్ అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్‌లను అందజేసిన పలువురిని కలెక్టర్, ఎస్పీ సత్కరించి జ్ఞాపికలను ప్రధానం చేశారు. కార్య క్రమంలో జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్ విజయసారధి, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, ట్రాన్స్‌పోర్టు అధికారి గంగాధర్, డాక్టర్ సింధూర, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.