‘ఘన’ సంబరం
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:22 AM
Republic Day celebrations శ్రీకాకుళం నగరంలో గల ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వైభవంగా రిపబ్లిక్ డే
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రగతికి అద్దం పట్టిన ప్రభుత్వ శకటాలు
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో గల ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల మాక్ డ్రిల్ ఆకట్టుకుంది.
అబ్బురపరచిన డాగ్ షో....
పోలీసు జాగిలాల(డాగ్ షో) విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఎనిమిదేళ్ల మున్నా అనే డాగ్ కలెక్టర్‌కు, నాలుగేళ్ల బ్యూటీ ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందించి, గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం డైసీ, మున్నా, బ్యూటీలు కలిసి చేసిన ‘ఒబీడియన్స్ డ్రిల్’, రెండేళ్ల రోజా చేసిన ‘హర్డిల్ జంప్’, అగ్నికీలల మధ్య నుంచి దూకే ప్రదర్శన, బ్యూటీ ప్రదర్శించిన ‘పేపర్ అండ్ మిల్స్ ఎక్సర్‌సైజ్ విన్యాసాలకు ప్రేక్షకుల చప్పట్లతో మైదానం మారుమోగింది. ఈ కార్యక్రమంలో శిక్షకులు మాధవరావు, కోదండరావు, ఈశ్వరరావు, జనార్దనలు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తిని చాటేలా సాగాయి. మరికొన్ని ప్రదర్శనలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టాయి.
దేశభక్తిని చాటేలా నృత్య ప్రదర్శనలు
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తిని చాటేలా సాగాయి. ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ప్రదర్శించిన ట్రైబల్ సాంగ్‌కు ప్రథమ బహుమతి, ‘మూడు రంగుల జెండావే’ అనే గీతానికి న్యూసెంట్రల్ స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యానికి ద్వితీయ,లావేరు కేజీబీవీ విద్యార్థినులు ప్రదర్శించిన ‘ఆపరేషన్ సిందూర్’ నృత్య రూపకానికి తృతీయ బహుమతి లభించాయి. వీరికి కలెక్టర్ బహుమతులు అందించారు.
శకటాల ప్రదర్శన
అభివృద్ధి, సంక్షేమాన్ని చాటుతూ వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో గ్రామీణ నీటి సరఫరా శకటానికి ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ, వైద్య, విద్యాశాఖ శకటాలకు సంయుక్తంగా తృతీయ బహుమతి లభించాయి. సమర యోధుల కుటుంబాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సత్కరించారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు. చివరిగా వివిధ స్టాల్స్‌ను సందర్శించి, పథకాల అమలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
జీడీపీ వృద్ధితో రాష్ట్రంలోనే 3వ స్థానం: కలెక్టర్
జిల్లాలోని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రగతిపథంలో పయనిస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘రెండవ త్రైమాసికానికి 43 శాతం జీడీపీ వృద్ధితో జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచింది. పొదుపు సంఘాల మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.278కోట్ల రుణాలు అందించి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాం. ఉపాధిహామీ పథకంలో 137.21లక్షల పనిదినాలు కల్పించి.. తొలిస్థానంలో నిలిచాం. సంక్షేమ పథకాల అమలులో కూడా అగ్రస్థానం సాధించాం. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ క్రింద 2.79లక్షల రైతులకు రూ.370.32 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. సాగునీటి రంగంలో రూ.176.35కోట్లతో హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసి 2.12లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. పొందూరు ఖాదీకి జీఐ హోదా లభించడం జిల్లాకు గర్వకారణం. జిల్లాకు రూ.5368కోట్లు పెట్టుబడులు రానున్నాయి. దీంతో 15,135మందికి ఉపాధి లభిస్తుంది. ఎన్టీఆర్ వైద్యసేవల కింద రూ.112.81కోట్లు సాయం అందించామ’ని తెలిపారు. అరసవల్లి సూర్యదేవుని రథసప్తమి వేడుకలను ఏడురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కెవి.మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, ఎమ్మెల్యే గొండు.శంకర్, ఆర్డీవోలు, ఏఎస్పీలు, డీఎస్పీలు, ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.