Share News

పలాస జీడికి ‘గ్లోబల్‌’ కిక్‌!

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:57 PM

Union Budget కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఆశలు రేకెత్తించింది. జిల్లా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇక్కడి జీవనాడి అయిన జీడి, కొబ్బరి, మత్స్య రంగాలకు, భవిష్యత్‌ వనరులైన ఖనిజాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ‘రేర్‌ ఎర్త్‌’ కారిడార్‌ ప్రకటన జిల్లా పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది.

పలాస జీడికి ‘గ్లోబల్‌’ కిక్‌!

  • ఉద్దానం కొబ్బరికి ‘రీ-ప్లాంటేషన్‌’ దన్ను

  • తీరప్రాంత ఇసుకలో ‘రేర్‌ ఎర్త్‌’ మెరుపులు

  • అంతర్జాతీయ జలాల్లో వేటకు పన్ను మినహాయింపు..

  • జూట్‌ మిల్లులకు ‘నేషనల్‌ ఫైబర్‌’ ఊపిరి..

  • పైడిభీమవరానికి ‘బయో’ బూస్ట్‌

  • ఊరటనిచ్చేలా కేంద్రబడ్జెట్‌

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి) : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఆశలు రేకెత్తించింది. జిల్లా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇక్కడి జీవనాడి అయిన జీడి, కొబ్బరి, మత్స్య రంగాలకు, భవిష్యత్‌ వనరులైన ఖనిజాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ‘రేర్‌ ఎర్త్‌’ కారిడార్‌ ప్రకటన జిల్లా పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన జీడి పరిశ్రమకు ఈ బడ్జెట్‌ స్వర్ణయుగాన్ని సూచిస్తోంది. 2030 నాటికి భారతీయ జీడిపప్పును ‘ప్రీమియం గ్లోబల్‌ బ్రాండ్‌’ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ముడి జీడిపప్పు ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ప్రత్యేక మిషన్‌ ప్రకటించింది. ఇది పలాస, మందస, వజ్రపుకొత్తూరు రైతులకు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు శుభవార్త. విదేశీ ముడిసరుకు(ఆర్‌సీఎన్‌) దిగుమతి కష్టాలు తీరడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో పలాస జీడికి ప్రత్యేక గుర్తింపు లభించి ధరలు పెరిగే అవకాశముంది.

  • ఉద్దానం కొబ్బరికి ‘పునరుజ్జీవం’

  • తుఫాన్లు, చీడపీడలు, వృద్ధాప్యంతో సతమతమవుతున్న ఉద్దానం కొబ్బరి రైతులకు ఈ బడ్జెట్‌ భరోసా ఇచ్చింది. ‘కొబ్బరి ప్రోత్సాహక పథకం’ కింద.. పాత, దిగుబడి రాని చెట్ల స్థానంలో కొత్త హైబ్రిడ్‌ మొక్కలు నాటడానికి భారీ నిధులు కేటాయించారు. కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లోని రైతులు తమ తోటలను పునరుద్ధరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కొత్త రకం మొక్కలతో దిగుబడి, ఆదాయం రెండూ పెరుగుతాయి.

  • తీరప్రాంతంలో ‘సిరి’ మెరుపులు

  • జిల్లాలోని 193 కిలోమీటర్ల తీరప్రాంతం అపారమైన ఖనిజ సంపదకు నిలయం. అరుదైన ఖనిజాల(రేర్‌ ఎర్త్‌) వెలికితీత, శుద్ధి కోసం రాష్ట్రంలో ‘డెడికేటెడ్‌ రేర్‌ ఎర్త్‌ కారిడార్‌’ ఏర్పాటు చేయనున్నారు. తీరంలోని మోనజైట్‌, ఇల్మినైట్‌, గార్నెట్‌ వంటి ఖనిజాల ఆధారిత పరిశ్రమలు జిల్లాకు తరలివచ్చే అవకాశం ఉంది. స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

  • మత్స్యకారులకు లాభాలు..

  • మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్‌ రెండు ప్రధాన వరాలు ప్రకటించింది. భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో (హై సీస్‌) వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఇది డీప్‌సీ ఫిషింగ్‌ చేసే బోటు యజమానులకు భారీ ఊరట. రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌లో వాడే ముడిసరుకుల దిగుమది సుంకం మినహాయింపు పరిమితిని ఒక శాతం నుంచి 3 శాతానికి పెంచారు. ఇది జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.

  • జూట్‌-ఫార్మా పరిశ్రమలకు ఊతం..

  • రాజాం(ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా), ఆమదాలవలస ప్రాంతాల్లో మూతపడే దశలో ఉన్న జూట్‌ మిల్లులకు ‘నేషనల్‌ ఫైబర్‌ మిషన్‌’ ద్వారా నిధులొచ్చే వీలుంది. ఇది మిల్లుల ఆధునికీకరణకు, కార్మికుల భద్రతకు దోహదపడుతుంది. రూ.10,000 కోట్లతో ప్రకటించిన ‘బయోఫార్మా శక్తి’ పథకం... జిల్లాలోని పైడిభీమవరం ఫార్మా క్లస్టర్‌ విస్తరణకు దోహదపడనుంది.

  • పొందూరు ఖాదీకి పూర్వ వైభవం

  • జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన పొందూరు ఖాదీకి, గిరిజన ఉత్పత్తులకు బడ్జెట్‌లో చోటు దక్కింది. ఖాదీ, హస్తకళలను బలోపేతం చేయడానికి ‘మహాత్మా గాంధీ గ్రామ్‌ స్వరాజ్‌’ పథకాన్ని ప్రకటించారు. ఇది గ్లోబల్‌ మార్కెటింగ్‌, బ్రాండింగ్‌కు సాయపడుతుంది. ఆదరణ తగ్గుతున్న పొందూరు ఖాదీకి ఈ పథకం ద్వారా కొత్త ఊపిరి అందే అవకాశముంది. అలాగే ఏజెన్సీలలో గిరిజనులు తయారు చేసే హస్తకళా ఉత్పత్తులకు (బాంబూ క్రాఫ్ట్స్‌, సవర పెయింటింగ్స్‌) సరైన మార్కెటింగ్‌ సదుపాయం లభిస్తుంది.

  • మహిళలకు ‘లక్షాధికారి’ యోగం..

  • స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ‘షీ మార్ట్స్‌’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనివల్ల జిల్లాలోని డ్వాక్రా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను(ఊరగాయలు, అప్పడాలు, చేతివృత్తులు) నేరుగా అమ్ముకునే వీలు కలుగుతుంది. అలాగే సైన్స్‌, టెక్నాలజీ (ఎస్‌టీఈఎం) కోర్సులు చదివే అమ్మాయిల కోసం ప్రతి జిల్లాలో ఒక హాస్టల్‌ నిర్మిస్తామని చెప్పారు. ఉన్నత చదువుల కోసం విశాఖ, విజయనగరం వెళ్లే సిక్కోలు ఆడబిడ్డలకు ఇది ఉపయోగపడుతుంది.

  • సిక్కోలుకు ‘పూర్వోదయ’ వరం!

  • కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘పూర్వోదయ’ పథకం మన జిల్లా రైల్వే రవాణా వ్యవస్థకు జీవం పోయనుంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. బడ్జెట్‌లో ‘ఇంటిగ్రేటెడ్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’ అభివృద్ధిని కేంద్రం ప్రతిపాదించింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి.. రైల్వే లైన్‌ను ఆనుకుని ఉండే శ్రీకాకుళం జిల్లా.. ఈ కారిడార్‌లో కీలక భాగస్వామిగా మారనుంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పనులు (శ్రీకాకుళం రోడ్‌, పలాస, నౌపడ), ట్రాక్‌ ఆధునికీకరణ, భద్రతా పరమైన పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

  • నిరాశ పరిచిన అంశాలు..

  • బడ్జెట్‌లో మెరుపులున్నా.. జిల్లా చిరకాల వాంఛలకు మాత్రం గ్రహణం వీడలేదు. విశాఖ రైల్వేజోన్‌ పనులు, శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస రైల్వే స్టేషన్‌) అభివృద్ధిపై స్పష్టత లేదు. వంశధార-నాగావళి అనుసంధానానికి, వంశధార ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. ఉద్దానం కిడ్నీ సమస్యపై శాశ్వత పరిష్కారానికి జాతీయ స్థాయి రీసెర్చ్‌ సెంటర్‌ ఊసే లేదు. మొత్తంగా చూస్తే ఇది సిక్కోలు ‘రైతు, పారిశ్రామిక వర్గాలకు అనుకూల బడ్జెట్‌’. జీడి, కొబ్బరి, ఖనిజాల విషయంలో కేంద్రం ఇచ్చిన రోడ్‌మ్యాప్‌ను.. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అందిపుచ్చుకుంటే జిల్లా రూపురేఖలు మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • ‘వికసిత్‌’ పద్దుతో ప్రగతి: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌ దేశాభివృద్ధికి దిక్సూచిలా, సామాన్యుడికి రక్షణ కవచంలా ఉందని కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే.. మౌలిక వసతులు, విద్య, వైద్యం, రైతాంగం, యువతకు పెద్దపీట వేశారని కొనియాడారు. బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటులో భాగంగా ఏపీకి నిధుల కేటాయింపులో సింహభాగం దక్కడంపై కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అస్థిరతలు ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 12.2లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టడం మోదీ సర్కార్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. విదేశీ పర్యటనలపై పన్ను తగ్గింపు, విమాన విడిభాగాలపై సుంకాల సవరణ నిర్ణయాల పౌర విమానయాన రంగానికి కొత్త రెక్కలు తొడుగుతాయని తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రయాణికులపై భారాన్ని తగ్గించడంతోపాటు, మరిన్ని పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు దోహదపడతాయన్నారు.

  • ఉద్దానానికి ఊతం

  • ‘శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ఈ బడ్జెట్‌ తీపి కబురు అందించింది. కొబ్బరి, జీడి, మామిడి సాగుకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం శుభపరిణామం. ముఖ్యంగా ‘కొబ్బరి ప్రోత్సాహక పథకం’ ద్వారా ఉద్దాన ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. రైతుల కష్టాలు తీరుతాయి. ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాల ఏర్పాటు నిర్ణయం... పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి గొప్ప వరం. కొత్త ఆదాయపు పన్ను చట్టం ద్వారా మధ్యతరగతి ఉద్యోగులకు, సామాన్యులకు పన్ను భారం తగ్గింది. ఏడు నగరాల మధ్య హైస్పీడ్‌ కారిడార్లు, టూరిజం అభివృద్ధి, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యసాధనను వేగవంతం చేస్తాయ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

  • ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట : మంత్రి అచ్చెన్న

  • ‘కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రూ.155.32 కోట్లు కేటాయించడం హర్షణీయం. ఈ బడ్జెట్‌ దేశ వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి సారం పెరగడంతో పాటు రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది. రిజర్వాయర్లలో చేపల పెంపకం, పశు సంవర్థక శాఖకు ఇచ్చిన ప్రోత్సాహకాలు గ్రామీణ ఉపాధిని మెరుగుపరుస్తాయి. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు, పాత చెట్ల స్థానంలో కొత్త వాటిని నాటేందుకు కేంద్రం ప్రకటించిన సాయం తోటల ఉత్పాదకతను పెంచుతుంది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌ రూపకల్పన చేసినందుకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు ధన్యవాదాలు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 11:57 PM