ఆడుకుంటూ తప్పిపోయిన బాలిక
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:57 PM
ఆడుకుంటూ తప్పిపోయిన మూడేళ్ల బాలికను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన శనివారం రాత్రి నరసన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది.
-ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న వైనం
- స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
- కొంతసమయం తరువాత తల్లిదండ్రులకు అప్పగింత
నరసన్నపేట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆడుకుంటూ తప్పిపోయిన మూడేళ్ల బాలికను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన శనివారం రాత్రి నరసన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన రవి బెహ్ర, కమల బెహ్ర దంపతుల కుమార్తె తోటి పిల్లలతో శనివారం సాయంత్రం ఆడుకుంటూ తప్పిపోయింది. నడుచుకుంటూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంది. ఇంటికి వెళ్లే మార్గం తెలియక కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు బాలికను ఎత్తుకొని వాకబు చేయగా, తల్లిదండ్రుల పేర్లను చెప్పలేకపోయింది. దీంతో పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. సాయంత్రం 6.30 గంటలకు పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కలా వెతకడం ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గాలిస్తుండగా చిన్నారిని పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో పోలీసులు కూడా ఆ చిన్నారిని ఎత్తుకొని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పలు వీధుల్లో తిరిగారు. చివరకు కాంప్లెక్స్ ప్రాంతంలోనే చిన్నారి తల్లి కమల బెహ్ర కనిపించడంతో ఆమెకు బాలికను అప్పగించారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పనులకు వెళ్లే సమయంలో సంరక్షకులకు అప్పగించాలని ఎస్‌ఐ గణేష్ సూచించారు.