సరదా విహారం.. తీరంలో ప్రమాదం
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:45 PM
Six people missing in two incidents సెలవురోజుల్లో సరదా విహారం విషాదం అవుతోంది. నీటిలోకి వెళ్లి, ఫొటోలు దిగుతున్న సందర్భంలో మృత్యువు కబళిస్తోంది. ఈ ఉదంతాలు ఎన్నో కుటుంబాలకు జీవితాంతం తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న వరుస సముద్ర ప్రమాదాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.
వరుస ఘటనలతో విద్యార్థులు, యువతలో ఆందోళన
ఇటీవల రెండు ఘటనల్లో ఆరుగురు గల్లంతు.. ఐదుగురి మృతి
కార్తీక మాసంలో పిక్నిక్‌లకు వెళ్లేవారికి అప్రమత్తత అవసరం
గత నెల 20న విజయదశమి సందర్భంగా శ్రీకాకుళం మండలం పీజీపేట సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నగరంలోని ఓ పైవ్రేటు శిక్షణ సంస్థకు చెందిన 25మంది యువతీ యువకులు విహారయాత్రకు వెళ్లారు. సముద్రతీరంలో సరదాగా గడుపుతూ కొందరు సెల్ఫీలు తీసుకుంటుండగా అలల ఉధృతికి చిక్కుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతీ యువకులు అర్ధంతరంగా తనువు చాలించడం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
తాజాగా ఈ నెల 9న ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శ్రీకాకుళం రూరల్ మండలం పుక్కళ్లపేట సముద్రతీరానికి వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతుండగా ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో జి.మనోజ్ మృతదేహం మంగళవారం అదే ప్రాంతంలో లభ్యమైంది. మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కొద్దిరోజుల వ్యవధిలో వరుసగా సముద్ర ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది.
ఎచ్చెర్ల/ శ్రీకాకుళం క్రైం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సెలవురోజుల్లో సరదా విహారం విషాదం అవుతోంది. నీటిలోకి వెళ్లి, ఫొటోలు దిగుతున్న సందర్భంలో మృత్యువు కబళిస్తోంది. ఈ ఉదంతాలు ఎన్నో కుటుంబాలకు జీవితాంతం తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న వరుస సముద్ర ప్రమాదాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దసరా విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోగా, తాజాగా, పుక్కళ్లపేట సముద్రతీరంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో కుటుంబాలు, యువకులు పెద్ద సంఖ్యలో బీచ్‌లకు వెళ్లే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తత అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థి మృతదేహం
శ్రీకాకుళం మండలం పుక్కళ్లపేట వద్ద సోమవారం సముద్రంలో గల్లంతైన గంగాధర్ మణికంఠ(22) అనే విద్యార్థి మృతి చెందాడు. ఆయన మృతదేహం మంగళవారం ఉదయం పుక్కళ్లపేట తీరానికి కొట్టుకొచ్చింది. ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు సోమవారం సెలవు కావడంతో మధ్యాహ్నం పుక్కళ్లపేట బీచ్‌కు వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగగా అలల ఉధృతికి మణికంఠతోపాటు రాజాం పట్టణానికి చెందిన జి.మనోజ్‌కుమార్ అనే విద్యార్థి గల్లంతైన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. మణికంఠ మృతదేహం మంగళవారం ఉదయం పుక్కళ్లపేట సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో విద్యార్థి మనోజ్‌కుమార్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మణికంఠది పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఘనసర గ్రామం. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి జగన్నాథం కూరగాయలు విక్రయిస్తూ కుమారుడిని చదివిస్తున్నారు. తల్లి సరస్వతి అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం 10 గంటల వరకు స్నేహితులతో కలిసి ఉన్నాడని, అనంతరం కళాశాలకు వెళ్లాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తాడని కలలు కన్నామని, కానీ, ఆ దేవుడు తమకు అన్యాయం చేశాడని రోదిస్తున్నారు. ఘనసరలో మణికంఠ అంత్యక్రియలు నిర్వహించారు.
సరదా క్షణం.. జీవితాంతం విషాదం
సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ప్రవాహాలు, అలల ఉధృతి ప్రమాదకరంగా ఉంటాయి. తీరానికి సమీపంలోనే లోతు ఎక్కువగా ఉండటం, ఇసుకలో ఊబి ఏర్పడటం వంటివి ప్రమాదాలకు కారణమవుతుంటాయి. వీటిపై అవగాహన లేకుండా యువత ఉత్సాహంతో నీటిలోకి దిగుతున్నారు. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోల కోసం అలలకు దగ్గరగా వెళ్లి ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా నదీ-సముద్ర సంగమ ప్రాంతాలు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల సమీపంలో మరింత జాగ్రత్త అవసరం. స్నేహితులతో ఆనందంగా గడిపేందుకు వెళ్లిన వారు క్షణాల్లో కనిపించకుండా పోవడం, వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవడం విషాదకరంగా మారుతోంది.
పిక్నిక్ వేళ అప్రమత్తత అవసరం
శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని మొగదలపాడు, కుందువానిపేట, కళింగపట్నం, డి.మత్స్యలేశం తదితర ప్రాంతాలు పిక్నిక్ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. కార్తీక మాసంలో కుటుంబాలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కొందరు సముద్రంలో స్నానాలకు దిగుతుండగా, మరికొందరు సెల్ఫీలు, ఫొటోలు, వీడియోల కోసం నీటికి దగ్గరగా వెళుతుంటారు. తీరంలో క్రికెట్ వంటి ఆటలు ఆడుతూ ఉత్సాహంలో సముద్రం లోతు, అలల తీవ్రతను పట్టించుకోరు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో వెళ్లినప్పుడు సరదాతోపాటు భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం:
సముద్ర ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు సూచనలు చేస్తున్నాం. సెలవు రోజుల్లో, కార్తీక మాసంలో పిక్నిక్ ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళల్లో సముద్రంలోకి దిగడం మరింత ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ప్రజలు పోలీసులకు సహకరించాలి.
బి.ప్రసాదరావు, సీఐ, కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్