Share News

స్నేహితుడే కాలయముడై!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:26 AM

లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన కొన్న అసిరినాయుడు హత్య కేసు మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

  స్నేహితుడే                కాలయముడై!
: కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ధనుంజయనాయుడు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన కొన్న అసిరినాయుడు హత్య కేసు మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధనుంజయనాయుడు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 2న అసిరినాయుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య మంజు 3వ తేదీన లావేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి... అతని ఆచూకీ కోసం గాలించారు.

కాల్‌ డేటా ఆధారంతో...

ఈ క్రమంలో అర్జునవలస గ్రామంలోని చెరువులో గుర్తు తెలియని మోటార్‌ సైకిల్‌ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతుడి మొబైల్‌ ఫోన్‌, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసిరినాయుడు చివరిగా తన స్నేహితుడు, వేణుగోపాలపురానికి చెందిన లండ ఆదినారాయణ అలియాస్‌ గౌరునాయుడితో మాట్లాడినట్టు గుర్తించారు. హత్య అనంతరం ఆదినారాయణ విశాఖపట్నం వెళ్లి తన మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసిరినాయుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యాపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. స్నేహితుడైన ఆదినారాయణతో కలిసి లావేరు మండలంలోని అటవీ ప్రాంతాలకు వెళ్లి నాటు తుపాకీతో అడవి జంతువులను వేటాడి... వాటి మాంసాన్ని విక్రయించే వారు.

అనుమానంతోనే...

ఈ క్రమంలో తన భార్య మంజుతో ఆదినారాయణకు వివాహేతర సంబంధం ఉన్నట్టు అసిరినాయుడు అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై ఈ నెల 2న వేటకు వెళ్లిన సమయంలో అసిరినాయుడు ఆదినారాయణను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసిరినాయుడును ఆదినారాయణ వెనుక నుంచి తుపాకీతో తల వెనుక భాగంలో కాల్చి హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా కత్తితో మృతదేహం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం తాళ్లవలస గ్రామ సమీపంలోని పాటుబడిన బావిలో మొండేన్ని పడేశాడు. అక్కడికి సుమారు 300 మీటర్ల దూరంలోని తాటిచెట్ల మధ్య తలను పాతి పెట్టాడు. బావిలో మృతదేహం ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాన్ని వెలికితీశారు. ఆదినారాయణను అదుపులోకి తీఉకొని విచారించడంతో పూర్తి వివరాలు బయటపడ్డాయి. నిందితుడిపై హత్య కేసుతో పాటు ఆయుధాల చట్టం కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ ధనుంజయ నాయుడు తెలిపారు. నిందితుడు వినియోగించిన నాటు తుపాకీని జంతువులను వేటాడేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి తెప్పించినట్టు వెల్లడించారు.ఙ

Updated Date - Nov 16 , 2026 | 12:26 AM