జనం మెచ్చిన జానపదం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:02 AM
Srikakulam artists performing the Tappetagullu dance జానపదాలకు సిక్కోలు నిలయం. జిల్లాలో ఎంతో మంది జానపద కళాకారులుగా రాణిస్తున్నారు. తప్పెటగుళ్లు, కోలాటం, థింసా నృత్యం.. తదితర ప్రదర్శనల్లో సత్తా చాటుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో కళాకారుల ప్రదర్శనలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
తప్పెటగుళ్ల ప్రదర్శనలో జిల్లా కళాకారులు
కోలాటం, థింసా నృత్యాల్లో అద్భుత ప్రతిభ
పల్లె నుంచి ఢిల్లీ వరకూ సత్తా
నేడు అంతర్జాతీయ జానపద దినోత్సవం
ఎచ్చెర్ల/ నరసన్నపేట/ మెళియాపుట్టి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):
జానపదాలకు సిక్కోలు నిలయం. జిల్లాలో ఎంతో మంది జానపద కళాకారులుగా రాణిస్తున్నారు. తప్పెటగుళ్లు, కోలాటం, థింసా నృత్యం.. తదితర ప్రదర్శనల్లో సత్తా చాటుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో కళాకారుల ప్రదర్శనలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలో పుట్టిన అపురూప జానపద కళారూపం తప్పెటగుళ్లు ప్రదర్శన. తప్పెటలను ఛాతికి కట్టుకుని.. గుండెలదిరే దరవులు, లయబద్ధమైన అడుగులు, గాల్లోకి ఎగిరే విన్యాసాలతో ప్రాచీన కళా వైభవాన్ని దశదిశలా చాటుతున్నారు జిల్లాకు చెందిన తప్పెటగుళ్ల కళాకారులు. పల్లెల్లో గ్రామదేవత ఉత్సవాల నుంచి దేశ సర్వోన్నత వేదికల వరకు తమ ప్రతిభను చాటుతున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం, నరసన్నపేట పరిధిలోని సత్యవరం, నారాయణవలస, పెద్దపాడు, గోదాలం, మెళియాపుట్టి మండలం చీపురుపల్లితోపాటు ఉద్దానం ప్రాంతంలో తప్పెటగుళ్ల కళాకారులు అధికంగా ఉన్నారు. ఎస్.ఎం.పురం కళాకారులు ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమక్షంలో అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నారు. స్వాతంత్య్ర, గణతంత్య్ర వేడుకల్లో పలుమార్లు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారధిగా నిలిచి రాజపథ్‌పై సత్తాచాటారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేదికలపై రాష్ట్రం తరపున ఎస్.ఎం.పురం కళాకారులు ప్రాతినిథ్యం వహించి విశేష ఆదరణ దక్కించుకున్నారు. అలాగే తెలంగాణ, ఒడిసా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సాంస్కృతిక సమ్మేళనాల్లో తమదైన శైలిలో అలరించి జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. పండగలు, గ్రామ దేవత ఉత్సవాల్లోనూ అద్భుత ప్రదర్శనతో భక్తిభావాన్ని, ఉత్సాహాన్ని నింపుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వినాయకచవితి, దసరా నవరాత్రుల ఉత్సవాల్లో తప్పెటగుళ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మెళియాపుట్టి మండలం చీపురుపల్లికి చెందిన తప్పెటగుళ్లు కళాకారులు సుమారు 15 ఏళ్లుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రస్తుతం 15 మంది వరకు బృందంగా ఏర్పడి.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలో అత్యధికంగా ప్రదర్శనలిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదాయాత్రలో ప్రత్యేక అటను కనపరిచి అభినందనలు పొందారు. ఇటీవల బోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభ సమయంలో వీరి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చెంచుల కళకు ప్రోత్సాహం
జిల్లాలో ఒకప్పుడు ఎక్కడ చూసినా చెంచుల నృత్యంతో సందడిగా ఉండేది. సుమారు పది మంది బృందంగా ఏర్పడి.. నెమలి పించం తలకు ధరించి.. పిల్లి చర్మం, నల్లనికోటు దానిపై నల్లని కంబలి ధరిస్తూ చేతిలో పిల్లనిగ్రోవి. మరోక చేతిలో కంచుతో చేసిన వాయిద్యం చేతపట్టుకొని జానపద గేయాలను పాడుతూ నృత్యం చేసేవారు. ప్రస్తుతం నరసన్నపేట మండలం గుండువిల్లిపేటలో ఉన్న 10 కుటుంబాలు చెంచుల కళను కొనసాగిస్తున్నారు. చెంచు కళను అంతరించపోకుండా నేటికి గ్రామాల్లో ప్రదర్శనలు ఇస్తున్న గుండువిల్లిపేటకు చెందిన ఆవల జగన్నాథానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారం అందజేసింది.
కోలాటం.. పల్లె పడుచుల ఆధ్యాత్మిక నాదం
చేతిలో రంగుల కర్రలు.. పాదాల్లో లయబద్ధమైన కదలికలు.. పెదవులపై ఆధ్యాత్మిక సంకీర్తనలు... వెరసి పల్లె పడుచులు జానపద కళారూపానికి ప్రాణం పోస్తున్నారు. నిరక్షరాస్యతను అధిగమించి, ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీ తంగివానిపేట మహిళలు కోలాట ప్రదర్శనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2014లో శ్రీ ఆనంద రామ భజన మండలి, అయోధ్యరామ భజన మండలి ఆధ్వర్యంలో 20 మంది గ్రామీణ మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. తిరుపతికి చెందిన దుర్గాబాయి వద్ద శాస్త్రీయంగా కోలాటం మెలకువలు నేర్చుకున్న ఈ మహిళలు, పల్లె జాతర స్థాయి నుంచి జాతీయ పుణ్యక్షేత్రాల వరకు తమ ప్రస్థానాన్ని విస్తరించారు. హరిద్వార్, హృషీకేష్, బద్రీనాథ్, హంపి, తిరుమల వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి వేలాది మంది భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ బృందానికి తంగి లక్ష్మి, రామలక్ష్మి, నీలవేణిలు నాయకత్వం వహిస్తుండగా, మాజీ సర్పంచ్ తంగి మల్లేశ్వరరావు సారధ్యంలో బట్న గోపాలరావు (హార్మోనియం), బట్న మల్లేశ్వరరావు (డోలక్), రెడ్డి రమణ , రాజు (గానం) సంగీత సహకారం అందిస్తూ కార్యక్రమాలను రక్తి కట్టిస్తున్నారు.
థింసా నృత్యానికి ప్రత్యేక గుర్తింపు
గిరిజనుల సంప్రదాయ నృత్యాల్లో థింసా ఒకటి. గిరిజనుల పండుగలు, వివాహ వేడుకల్లో రంగుల దుస్తుల ధరించి.. వాయిద్యాల హోరుకు అనుగుణంగా వృత్తాకారంలో థింసా నృత్యం చేస్తుంటారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయంలో ప్రధానమంత్రి మోదీ వచ్చిన సందర్భంగా సుమారు 13వేల మంది విద్యార్థులు థింసా నృత్యం చేసి.. గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నారు. జిల్లాలో మెళియాపుట్టి, మందస, టెక్కలి, పాతపట్నం, కోత్తూరు, హిరమండలం మండలాల్లో అధికంగా గిరిజనులు థింసా నృత్యం కొనసాగిస్తున్నారు.
సంస్కృతికి జీవం
గ్రామీణ సంస్కృతికి జీవం పోయాలనే లక్ష్యంతోనే.. తప్పెటగుళ్లు ప్రదర్శనలు చేస్తున్నాం. అనాటి జీవన విధానాలు.. హైందవ సంస్కృతిని ఇనుమడింపజేయడలంలో తప్పెటగుళ్లు కీలకపాత్ర వహిస్తాయి. ఉత్తరాంధ్ర సంప్రదాయానికి ప్రతీకగా తప్పెటుగుళ్లు నిలుస్తున్నాయి.
- శిమ్మ లక్ష్మణరావు, శ్రీవెంకటరమణ తప్పెటగుళ్లు బృంద ఆర్గనైజర్, నారాయణవలస
నేటి తరం దూరం
తప్పెటుగుళ్లు ప్రదర్శన కళింగ సంస్కృతికి ప్రతీక. ఒకనాడు యాదవజాతిలో ఉండే సంప్రదాయం నేడు అన్నీ జాతుల్లో విస్తరించింది. అయితే నేటి యువత దీనిపై అంత మక్కువ చూపించడం లేదు. ఈ సంస్కృతీ, సంప్రదాయం మాతో అంతరించినట్లు ఉంది.
- చిన్నాల లోకనాథం, తప్పెటగుళ్లు గురువు, నారాయణవలస