లంచం లేనిదే ఫైల్ కదలదు!
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:13 AM
Corruption in the Revenue Department ప్రభుత్వ శాఖల్లో లంచం ఇవ్వనిదే ఫైల్ కదిలించని అవినీతి అధికారులు, సిబ్బంది చాలామంది ఉన్నారు. అందులో కొందరే ఏసీబీకి పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలను తీసుకొచ్చినా దానిని వారు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే ఇప్పుడు రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసులు కురిపిస్తోంది.
రెవెన్యూ శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతి
రిజిస్ర్టేషన్, సబ్ ట్రెజరీల్లో సైతం
అన్ని శాఖల్లోనూ వసూలు రాజాలు
ధైర్యం చేసి ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు
రణస్థలం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 5న లావేరు మండలం లోపెంట వీఆర్వో ఏ.మల్లేశ్వరరావు ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సత్యనారాయణ అనే రైతుకు చెందిన భూమి 7 ఎకరాల వరకూ ఉంది. ఇటీవల రీ సర్వే పూర్తికావడంతో తన భార్య, కుమారుడు పేరుతో మ్యూటేషన్ పెట్టుకున్నాడు. అడంగల్, పట్టాదారు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఈ ఏడాది మార్చి 2న బీసీ సంక్షేమ సహాయ అధికారి గడ్డి బాల ముకుందరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణకు సంబంధించి ఒక్కో వార్డెన్ నుంచి బిల్లుల కోసం రూ.15 వేలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రూ.10 కోట్ల విలువైన ఆస్తులను, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 28న శ్రీకాకుళం నగరంలో ఇద్దరు సబ్‌ట్రెజరీ ఉద్యోగులు రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ సచివాలయ ఉద్యోగికి సంబంధించి వేతన బకాయిలు చెల్లించేందుకుగాను లంచం డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి.. లంచం తీసుకుంటున్న రవిప్రసాద్, శ్రీనివాసరావు అనే ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
ఇలా ప్రభుత్వ శాఖల్లో లంచం ఇవ్వనిదే ఫైల్ కదిలించని అవినీతి అధికారులు, సిబ్బంది చాలామంది ఉన్నారు. అందులో కొందరే ఏసీబీకి పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలను తీసుకొచ్చినా దానిని వారు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే ఇప్పుడు రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. మ్యూటేషన్,అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం, ధ్రువపత్రాలో తప్పుడు పేర్లు సరిచేసేందుకు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలో ఏ చిన్నపనైనా ఉంటే అక్కడ ‘వసూలు రాజాలు’ వాలిపోతున్నారు. వారే అన్ని పనులు పూర్తిచేస్తున్నారు. అందుకు ఇంత ఇచ్చుకోవాల్సిందేనని షరతు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్, రిజిస్ర్టేషన్లు, పోలీస్ శాఖల్లో అవినీతి సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల విషయంలో కూడా అధికారులు, సిబ్బంది వాటాలు అడుగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అప్రూవల్, అసెస్‌మెంట్ తదితర పనులకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పనులను త్వరితగతిన పూర్తిచేయించుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రజలే లంచాలను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రజలు సామాజిక బాధ్యతగా అవినీతి నిర్మూలనకు సహకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎక్కడైనా.. ఎవరైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా కార్యాలయంలో నేరుగా లేదా.. టోల్ ఫ్రీ నెంబర్ 14400కు సైతం ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.
ప్రజల్లో చైతన్యం రావాలి
ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పనిచేయించుకోవడం ప్రజల హక్కు. ప్రభుత్వం వారి పనికి తగ్గట్టు వేతనం అందిస్తుంది. అందుకే ఎక్కడైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదుచేయండి. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం. ఏ భయం వద్దు. అవసరమైతే ఫిర్యాదుదారులకు రక్షణ కల్పిస్తాం. స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలి.
- సత్యనారాయణ, ఏసీబీ డీఎస్పీ, శ్రీకాకుళం