Share News

పాఠశాలలకు పండుగ

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:39 AM

Mega Parent-Teacher Meeting Today విద్యార్థుల సమగ్ర వికాసం కోసం శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో మెగా పేరెంట్‌ - టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం 4.0) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పాఠశాలలను ముస్తాబు చేశారు.

పాఠశాలలకు పండుగ
ఒప్పంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ‘మెగా పీటీఎం 4.0’ ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన

  • నేడు మెగా పేరెంట్‌ - టీచర్స్‌ మీటింగ్‌

  • తల్లిదండ్రులకు క్రీడలు, రంగవల్లుల పోటీలు

  • విద్యార్థుల ప్రగతి నివేదికపై చర్చ

  • నరసన్నపేట, జూలై 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమగ్ర వికాసం కోసం శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో మెగా పేరెంట్‌ - టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం 4.0) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పాఠశాలలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులను విద్యావ్యవస్థలో భాగస్వామ్యం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మెగా పీటీఎం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలను పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకం పెంచి విద్యార్థుల భవిష్యత్‌పై చర్చించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి సహకారం అందించాలో తెలుసుకునేందుకు ఇది వేదిక కానుంది. గత విద్యాసంవత్సరంలో జూలై 10, డిసెంబరు 5న రెండుసార్లు ఈ సమావేశాలు నిర్వహించారు. కానీ కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో తల్లిదండ్రులు హాజరుకాలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు ఈఏడాది ముందుస్తుగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లీప్‌ యాప్‌పై అవగాహన పెంచారు. ఈ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపారు. తల్లిదండ్రుల ముఖాముఖిలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థి ప్రగతి నివేదిక అందజేస్తారు. ఆ విద్యార్థి ప్రత్యేక ప్రవర్తన, పాఠశాల ప్రగతి, అభివృద్ధి సామర్థ్యాలపై చర్చిస్తారు. మీటింగ్‌కు వచ్చిన తల్లులకు రంగోలి, లెమన్‌ స్ఫూన్‌, టాగ్గాఫ్‌ వార్‌ ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తారు. విద్యార్థులతో కలిసి ఫొటోలు తీసుకుంటారు. అనంతరం పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించారు.

  • పిల్లల కోసం ఈ ఒక్కరోజు.. హాజరుకావాలి : కలెక్టర్‌

  • ‘విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో మెగా పేరెంట్‌ - టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. జిల్లావ్యాప్తంగా సుమారు 2,613 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామ’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పండుగ వాతావరణంలో జరగనున్న పీటీఎం కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలి. పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ఏడాదిలో లభించే ఈ ఒక్కరోజు సమయాన్ని తల్లిదండ్రులు కేటాయించాలి. గతంలో సమావేశాలకు ఎక్కువగా తల్లులే వచ్చారు. పిల్లల భవిష్యత్‌, విద్యాప్రగతి దృష్ట్యా తండ్రుల భాగస్వామ్యం కూడా అత్యంత ఆవశ్యకం. పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి నివేదిక, విద్యాబోధన తీరును తెలుసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, మొక్కల సంరక్షణను పరిశీలించాలి. మెగా పీటీఎంను విజయవంతం చేయాల’ని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

  • నిర్వహణకు రూ.82.80 లక్షలు : డీఈవో రవిబాబు

  • జిల్లాలోని 2,613 ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం చేపట్టనున్న మెగా పీటీఎం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.82.80 లక్షల నిధులను విడుదల చేసిందని డీఈవో రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలల ఖాతాలకు నిధులు జమ చేశామన్నారు. 30 మంది విద్యార్థులున్న పాటశాలకు రూ.900, వంద మంది ఉంటే రూ.2,250, 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.4,500 చొప్పున నిధులు కేటాయించాం. వెయ్యిమంది విద్యార్థులు ఉంటే రూ.6,750.. ఆపై విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.9వేలు చొప్పున నగదు జమ చేశామన్నారు. ప్రధానోపాధ్యాయులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.

Updated Date - Jul 24 , 2026 | 12:39 AM