Share News

సెలవురోజు.. సేదదీరేందుకు వెళ్లి!

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:05 AM

Two engineering students missing మరుసటి రోజు నుంచి సెమిస్టర్‌ పరీక్షలు. సోమవారం సెలవు. కాస్త సేదదీరుదామని స్నేహితులంతా సముద్రతీరానికి వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు కళ్లముందే కొట్టుకుపోయారు. వారిని కాపాడలేక నిస్సహాయ స్థితిలో మిగిలిన విద్యార్థులు తల్లడిల్లిపోయారు.

సెలవురోజు.. సేదదీరేందుకు వెళ్లి!
జి.మణికంఠ, మనోజ్‌ (ఫైల్‌)

  • ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

  • క్షేమంగా ఒడ్డుకు చేరిన మరో విద్యార్థి

  • ఎచ్చెర్ల/శ్రీకాకుళం కైరం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మరుసటి రోజు నుంచి సెమిస్టర్‌ పరీక్షలు. సోమవారం సెలవు. కాస్త సేదదీరుదామని స్నేహితులంతా సముద్రతీరానికి వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు కళ్లముందే కొట్టుకుపోయారు. వారిని కాపాడలేక నిస్సహాయ స్థితిలో మిగిలిన విద్యార్థులు తల్లడిల్లిపోయారు. ఒకరు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగా.. ఇద్దరి ఆచూకీ మాత్రం గల్లంతైంది. ఈ ఘటన ఆ విద్యార్థుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

  • శ్రీకాకుళం మండలం పుక్కళ్లవానిపేట బీచ్‌ (ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌) వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు సోమవారం సెలవు కావడంతో.. మధ్యాహ్నం పుక్కళ్లపేట బీచ్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన జి.మణికంఠ (22), రాజాం పట్టణానికి చెందిన జి.మనోజ్‌ (21) గల్లంతయ్యారు. ఎచ్చెర్లకు చెందిన మరో విద్యార్థి అల్లు లిఖిత్‌ తోటి విద్యార్థుల సాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. కళ్ల ముందే ఇద్దరు స్నేహితులు గల్లంతుకావడంతో మిగిలిన విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కళింగపట్నం మెరైన్‌ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రూరల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా గాలించినా.. వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ఇద్దరి విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోందని మెరైన్‌ సీఐ ప్రసాదరావు తెలిపారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌పీవీ రమణమూర్తినాయుడు వద్ద ప్రస్తావించగా.. ‘బీటెక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థులకు 3(1) సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతుకావడం విషాదకరం. ఆ విద్యార్థులు డే స్కాలర్స్‌. సోమవారం వారికి తరగతులు కూడా లేవ’ని తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 12:05 AM