ఆధునిక తెలుగు కథకు దిక్సూచి
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:17 AM
Today is Chaso's 111th birth anniversary ఆయన పేరు చాగంటి సోమయాజులు. అయినా చాసోగానే బాగా ప్రాచుర్యం పొందారు. శ్రీకాకుళం నగరంలోని కానుకుర్తి వారి వీధిలో లక్ష్మీనరసమ్మ శర్మ, తులసమ్మ దంపతులకు 1915 జనవరి 17న జన్మించారు. నాగావళి నదీ తీరంలో పైరుపచ్చల మధ్యనే చాసో బాల్యం గడిచింది. ఆయన ఐదో ఫారంవరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు.
అభ్యుదయ రచయితగా గుర్తింపు
విద్యార్థి దశ నుంచే రచనలపై ఆసక్తి
నేడు చాసో 111వ జయంతి
ఆధునిక తెలుగు కథకు ఆయనొక దిక్సూచి. ఉత్తరాంధ్ర మాండలికానికి చిరునామా. విజయనగరం ఆయన కర్మభూమి అయితే.. శ్రీకాకుళం ఆయన జన్మభూమి. ఆయనే చాగంటి సోమయాజులు అలియాస్ చాసో. తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ కథకుడికి మన జిల్లాతో ఉన్న అనుబంధం ఎనలేనిది. ఈనెల 17న శనివారం ఆయన జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
ఎచ్చెర్ల/పాత శ్రీకాకుళం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఆయన పేరు చాగంటి సోమయాజులు. అయినా చాసోగానే బాగా ప్రాచుర్యం పొందారు. శ్రీకాకుళం నగరంలోని కానుకుర్తి వారి వీధిలో లక్ష్మీనరసమ్మ శర్మ, తులసమ్మ దంపతులకు 1915 జనవరి 17న జన్మించారు. నాగావళి నదీ తీరంలో పైరుపచ్చల మధ్యనే చాసో బాల్యం గడిచింది. ఆయన ఐదో ఫారంవరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన పెదతల్లి ఇంటికి విజయనగరం దత్తత వెళ్లారు. అనంతరం విజయనగరంలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. ఈయన స్నేహితులైన శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, ఆచార్య రోణంకి అప్పలస్వామి వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు. విజయనగరంతో పాటు ఎల్.కోట మండలం కంతకాపల్లిలో ఆయన ఐదారేళ్లు గడిపారు. కంతకాలపల్లిలో వ్యవసాయం కూడా చేశారు. విజయనగరం మూడులాంతర్లు వద్ద కస్పా హైస్కూల్ సమీపాన ఆయన ఇల్లు ఉండేది.
విద్యార్థి దశ నుంచే రచనలపై ఆసక్తి
చాసో విద్యార్థిగా ఉండగానే కవితా రచనకు శ్రీకారం చుట్టారు. ఈయన తొలి కవిత ‘ధర్మక్షేత్రం’ 1941 జూన్ సంచికలో, తొలికథ చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి. చాసో రాసిన కథల్లో పీడిత ప్రజల బాధలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానంగా కనిపిస్తాయి. ఈయన రాసిన చాలా కథలు హి ందీ, రష్యన్, కన్నడ, మలయాలం, మరాఠీ, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బర్మాపై జపాన్ బాంబు దాడులు జరిగాక, బర్మా నుంచి చాలా తెలుగు కుటుంబాలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో స్వగ్రామాలకు కాలినడకన చేరాయి. అప్పటి దుర్భరస్థితిని ఓ తల్లి హృదయ వేదనగా చాసో అక్షరీకరించారు. నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని.. చివరికి పొయ్యలో నిప్పులేదు, నీకేమి పెట్టేది నాయనా అనే తల్లి హృదయ వేదన తెలియజేసిన తీరు కన్నీళ్లు తెప్పిస్తుంది.
మాండలికానికి పట్టం
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సామాన్య ప్రజల భాషను (మాండలికాన్ని) సాహిత్యంలోకి బలంగా తీసుకొచ్చిన వారిలో చాసో ఆద్యులు. పుస్తక భాష కాకుండా.. మన ఊర్లోలోని మనుషులు మాట్లాడుకునే భాషను ఆయన కథల్లో వాడారు. ఆయన రాసిన ఎమ్పుతడి, కుంకుమ భరణి వంటి కథల్లో పాత్రలు మన పక్కింటి మనుషుల్లా అనిపిస్తాయి. సిక్కోలు సామాన్యుడి అమాయకత్వం ఇక్కడి పేదరికం, మధ్యతరగతి వెతలు ఆయన రచనల్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.
గుర్తింపు తెచ్చిన ‘కుంకుడాకు’
చాసో రాసిన కథల్లో కుంకుడాకు కథ మంచి గుర్తింపు పొందింది. ఒక కూలివాడి ఎనిమిదేళ్ల కూతురు గవిరి దీనగాథను ఈ కథలో ప్రస్తావించారు. ఆనాటి పరిస్థితులను తెలియజేస్తూ రాసిన ఈ కథ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ కథలో ఉత్తరాంధ్ర మాండలికాన్ని దండిగా రాశారు. అలాగే బొండు మల్లెలు, ఎంపు వంటి కథలు పేరొందాయి.
అభ్యుదయ రచయితగా గుర్తింపు
అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి సభలు తెనాలిలో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి చివరి శ్వాస విడిచేవరకు ‘అరసం’ కార్యకర్తగానే తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు. చాసో కథల్లో వస్తువూ, శిల్పమూ పోటాపోటీగా కన్పిస్తాయి. సమాజంలో వైరుధ్యాలు, ఆర్ధిక సూత్రాలే మానవ సంబంధాలలో మనిషి మనుగడలో కీలకపాత్ర పోషిస్తాయని అనే సత్యాన్ని కాందిశీకుడు కవితలో ఆవిష్కరించారు. చాసో సాహితీ లోకానికి ఇక సెలవు అంటూ చెన్నైలో 1994 జనవరి 1న ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆయన మరణాంతరం తన భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరడం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం.