Share News

ఇంట్లో కూర్చునే ‘జనగణన’

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:14 PM

దేశంలో మొట్టమొదటి డిజిటల్‌ జనగణన (సెన్సస్‌ 2027) ప్రక్రియకు సర్వం సిద్ధమవుతోంది.

ఇంట్లో కూర్చునే ‘జనగణన’

- స్మార్ట్‌ఫోన్‌లోనే మీ కుటుంబ వివరాల నమోదు

- తొలిసారిగా డిజిటల్‌ పద్ధతి

- సద్వినియోగించుకోవాలంటున్న అధికారులు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): దేశంలో మొట్టమొదటి డిజిటల్‌ జనగణన (సెన్సస్‌ 2027) ప్రక్రియకు సర్వం సిద్ధమవుతోంది. మునపటిలా ఎన్యుమరేటర్లు (గణాంక సిబ్బంది) ఇంటింటికి వచ్చి గంటల తరబడి వివరాలు అడిగేదాకా ఎదురుచూడాల్సిన పనిలేదు. పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా స్వయంగా తమ ఇంటి వివరాలను నమోదు చేసుకునే సువర్ణ అవకాశాన్ని ‘సెల్ఫ్‌-ఎన్యుమరేషన్‌’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ ఈ అధునాతన విధానాన్ని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువత.. తమ కుటుంబాలతో పాటు చుట్టుపక్కల వారి వివరాలను కూడా నమోదు చేయడంలో సహాయపడాలి. అసలు ఈ సెల్ఫ్‌-ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ఎలా చేయాలి? దీని వెనుక ఉన్న స్టెప్‌-బై-స్టెప్‌ ప్రాసెస్‌ ఏంటో జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న కథనం.

నమోదు ప్రక్రియ ఇలా...

స్టెప్‌ 1: ముందుగా మీ మొబైల్‌ లేదా కంప్యూటర్‌ బ్రౌజర్‌లోని హెచ్‌టీటీపీఎస్‌://ఎస్‌ఇ.సెన్సస్‌.జీవోవీ.ఇన్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్‌) ఎంచుకుని, స్ర్కీన్‌ మీద కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

స్టెప్‌ 2: కుటుంబ యజమాని (ఇంటి పెద్ద) పేరును నమోదు చేయాలి. ఆ తర్వాత మొబైల్‌ నెంబర్‌ ఇవ్వాలి. ఒక కుటుంబానికి ఒక మొబైల్‌ నెంబర్‌ మాత్రమే వాడాలి.

స్టెప్‌ 3: మీకు నచ్చిన, సులభంగా అర్థమయ్యే భాషను (తెలుగు లేదా ఇంగ్లీష్‌) ఎంచుకోవాలి. మీరు ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఒక వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది, దాన్ని ఎంటర్‌ చేసి నెంబర్‌ను వెరిఫై చేయాలి.

స్టెప్‌ 4: మీ జిల్లా (శ్రీకాకుళం), పిన్‌ కోడ్‌, మీ గ్రామం లేదా పట్టణం పేర్లను ఎంపిక చేసుకోవాలి. మ్యాప్‌లో కనిపించే ‘రెడ్‌ మార్కర్‌’ను ఖచ్చితంగా మీ ఇల్లు ఉన్న ప్రదేశానికి డ్రాగ్‌ చేసి లోకేషన్‌ సెట్‌ చేయాలి.

స్టెప్‌ 5: ఇళ్ల జాబితాకు సంబంధించిన ప్రశ్నలన్నీ స్ర్కీన్‌ మీద కనిపిస్తాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. అన్ని వివరాలు ఎంటర్‌ చేశాక, ఎక్కడైనా తప్పులు దొర్లాయేమో సరిచూసుకోవడానికి ‘ప్రివ్యూ’ బటన్‌ నొక్కి చెక్‌ చేసుకోవాలి.

స్టెప్‌ 6 : వివరాలన్నీ సరైనవే అని నిర్ధారించుకున్న తర్వాత ‘ఫైనల్‌ సబ్‌మిట్‌’ చేయాలి. వెంటనే మీ కోసం ‘హెచ్‌’ అక్షరంతో మొదలయ్యే 11 అంకెల ఒక విశిష్టమైన ఎస్‌ఈ ఐడీ (సెల్ఫ్‌-ఎన్యుమరేషన్‌ ఐడీ) జనరేట్‌ అవుతుంది. ఈ నెంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి. లేదా స్ర్కీన్‌ షాట్‌ తీసుకోవాలి.

గణాంక సిబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి?

మీరు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌-ఎన్యుమరేషన్‌ పూర్తి చేసినప్పటికీ, ప్రభుత్వ ప్రక్రియలో భాగంగా గణాంక సిబ్బంది ఒకసారి మీ ఇంటికి వస్తారు. ఆ సమయంలో మీరు మళ్లీ వివరాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సిబ్బంది వచ్చినప్పుడు.. మీరు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేసిన తర్వాత జనరేట్‌ అయిన 11 అంకెల ‘ఎస్‌ఈ ఐడీ’ (సెల్ఫ్‌-ఎన్యుమరేషన్‌ ఐడీ)ని వారికి చూపించాలి. వారు తమ పరికరంలో ఆ ఐడీ నమోదు చేయగానే, మీరు ముందుగా ఇచ్చిన డేటా మ్యాచ్‌ అవుతుంది. డేటా సరిపోలితే, మీ ఇంటి జనగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లే!

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ప్రజలంతా డిజిటల్‌ జనగణను సద్వినియోగం చేసుకోవాలి. మీ మొబైల్‌ ద్వారా ముందే వివరాలు నమోదు చేయడం వల్ల సిబ్బందికి, మీకు అమూల్యమైన సమయం ఆదా అవుతుంది. దేశ భవిష్యత్‌ ప్రణాళికలకు పునాది అయిన ఈ జనగణనలో జిల్లా వాసులంతా భాగస్వాములు కావాలి.

-హనుమంతు కూర్మారావు, నగరపాలక సంస్థ కమిషనర్‌

Updated Date - Apr 12 , 2026 | 11:14 PM