జ్ఞాపకాల పందిరి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:30 AM
Today is National Broadcasting Day ఆధునిక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో సమాచారం మనకు చేరిపోతుంది. ప్రసార మాధ్యమాలు విస్తృతం కావడంతో ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోరుంది. ఒక్క క్లిక్‌తో కావాల్సిన సమాచారం క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. కానీ 1927కు ముందు ప్రపంచంలో కాదు.. మన పక్కన ఏం జరిగేదో కూడా తెలిసేదికాదు. ప్రసారమాధ్యమాల జాడ కూడా కనిపించేది కాదు. 1927 తర్వాత రేడియో ఆవిర్భావంతో ఒక్కసారిగా కొత్త ప్రపంచం సాక్షాత్కరించింది.
వార్తల బులిటెన్.. రేడియో ఎవర్‌గ్రీన్
సినిమాలు, పాటల కోసం ఆసక్తి
వ్యవసాయ సూచనల కోసం ఎదురుచూపు
నేడు జాతీయ ప్రసార దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్/ మెళియాపుట్టి, జూలై 22(ఆంధ్రజ్యోతి):
ఆధునిక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో సమాచారం మనకు చేరిపోతుంది. ప్రసార మాధ్యమాలు విస్తృతం కావడంతో ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోరుంది. ఒక్క క్లిక్‌తో కావాల్సిన సమాచారం క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. కానీ 1927కు ముందు ప్రపంచంలో కాదు.. మన పక్కన ఏం జరిగేదో కూడా తెలిసేదికాదు. ప్రసారమాధ్యమాల జాడ కూడా కనిపించేది కాదు. 1927 తర్వాత రేడియో ఆవిర్భావంతో ఒక్కసారిగా కొత్త ప్రపంచం సాక్షాత్కరించింది. అప్పట్లో రేడియోల్లో వచ్చే ప్రసారాల కోసం ప్రజలు పరితపించేలా పరిస్థితి మారిపోయింది. ఒక్కో ఊరిలో ఒకటో రెండో రేడియోలు ఉండగా.. వాటిచుట్టూ ప్రజలు గుమిగూడి వార్తా సమాచారం, వ్యవసాయ మెలకువలు, తదితర విషయాలు ఆసక్తిగా తెలుసుకునేవారు. రచ్చబండల వద్ద కూర్చొని ఆ విషయాలు చర్చించుకునేవారు. గురువారం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా.. నాటితరం ప్రజల మనసుల్లో పదిలంగా గూడుకట్టుకున్న రేడియో విశిష్టతను, ప్రసారాలను తెలుసుకుందాం.
ఎన్నో కార్యక్రమాలు..
తెలుగులో రేడియో ప్రసారాలు ప్రారంభమైన తర్వాత తొలుత ఇంగ్లీష్, సంస్కృతం ప్రాంతీయ వార్తలు వచ్చేవి. వెంటనే తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమయ్యేవి. వీటితోపాటు భక్తిరంజని, పాడిపంటలు, యువవాణి, కదంబ కార్యక్రమం, బాలల కార్యక్రమాలు, సంగీత శిక్షణ, సాహితీ చర్చలు, తెలుగు, హిందీ సినీ గీతాలు, సినిమా, నాటకాలు హరికథగానం, కథలు, కథానికలు, క్రికెట్ కామెంటరీలు, వాతావరణ బులిటెన్లు, యుద్ధాల విశేషాలు ఇలా అన్నిరంగాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. రేడియో అంటే ఒకప్పుడు ప్రస్టేజ్ సింబల్‌గా ఉండేది. అప్పట్లో పెళ్లికి కట్నంగా రేడియో ఇచ్చేవారు. టీవీల రాకతో రేడియో వాడకం క్రమేపీ తగ్గింది. ప్రస్తుతం డిజిటల్ రంగంలో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో రెడియోలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. కాగా.. ఇప్పటికీ చాలామంది నాటి గుర్తుగా రెడియోలను పదిలంగా దాచుకున్నారు.
వార్తల కోసం ఎదురు చూసేవాళ్లం
ఎప్పుడు ఏడు గంటలవుతుందా, రేడియోలో వార్తలు విందామా? అన్న ఆతృత ఉండేది. ఊరిలో పంచాయితీ కార్యాలయం దగ్గర ఒకటే రేడియో ఉండేది. 6.10 గంటలకు ప్రాంతీయ వార్తలు వచ్చేవి. ఏడు గంటలకు సెంట్రల్ న్యూస్ వచ్చేది. చదువు పెద్దగా లేని మాలాంటి వాళ్లకు కూడా ఆ వార్తలు శుభ్రంగా అర్థమయ్యేవి.
- కొయ్యాన ఆదినారాయణ, కిల్లిపాలెం
వ్యవసాయ సూచనలు బాగుండేవి
రేడియోలో వచ్చే వ్యవసాయ సూచనలు ఎంతో బాగుండేవి. వరిసాగుకు భూమిని ఎలా తయారు చేయాలి. భూసారం పెరగడానికి ఎటువంటి ఎరువులు వెయ్యాలనేది బాగా చెప్పేవారు.
- రెడ్డి నరసయ్య, కిల్లిపాలెం
వయోలిన్ అద్భుతం
సంగీత కార్యక్రమాల కింద ప్రసారమయ్యే ద్వారం వెంకటస్వామి నాయుడి వయోలిన్ అద్భుతంగా ఉండేది. దీంతో పాటు బాలమురళీకృష్ణ సంగీత శిక్షణ కూడా బాగుండేది. ఇక కదంబ కార్యక్రమం, భక్తి రంజనిలో వచ్చే భక్తిపాటలు మనసుకు హాయినిచ్చేవి. టెల్కో కంపెనీ రేడియో ఎక్కువగా ఉండేది. అప్పట్లో అది 250 రూపాయలు. తరువాత ట్రాన్సిస్టర్‌లు వచ్చాయి. ఇంట్లో రేడియో ఉండేది కాదు. పక్కింట్లోనో, ఎక్కడో పార్క్‌లోనో ఉంటే అక్కడకు వెళ్లి వినేవాళ్లం.
- కె.విద్యాసాగర్, రిటైర్డ్ టీచర్, శ్రీకాకుళం
పాడి పంటలు బాగా ఉపయోగపడేది...
రేడియోలో వచ్చే పాడిపంటలు కార్యక్రమం రైతులకు బాగా ఉపయోగపడేది. నైర వ్యవసాయకళాశాలలో సైంటిస్ట్‌నైన నాకు రేడియోలో వచ్చే వ్యవసాయ సంబంధ సూచనలను రైతులతో క్షేత్రస్థాయిలో పంచుకొనే అవకాశం లభించింది. అధిక వర్షాలు, వరదల సమయంలో పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయాలు రైతులను ఆకట్టుకొనేవి.
- ఎ.కనకరాజు, విశ్రాంత సైంటిస్ట్, శ్రీకాకుళం
పాటలు నచ్చేవి
బినాకాడీత్‌మాలా పేరుతో రేడియోలో వచ్చే హిందీ పాటలు బాగా నచ్చేవి. మనసుకు హాయిగా ఉంటూ మళ్ళీ, మళ్ళీ వినాలనిపించేవి. రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమమే హరికథా గానం కూడా బాగుండేది.
-పి.కృష్ణారావు, విశ్రాంత అసిస్టెంట్ ఆడిటర్, శ్రీకాకుళం
క్రికెట్ కామెంటరీ తెగ నచ్చేది
అప్పట్లో రేడియోలో వచ్చే క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వింటుంటే భలే ఉండేది. ఇంగ్లీష్, హిందీలో కామెంటరీ వచ్చేది. కొన్ని తెలిసినా తెలియక పోయినా ఫోర్, సిక్స్‌లు మాత్రం తెలిసేవి. అక్కడ ఫోర్ కొడితే ఇక్కడ మనమే కొట్టినట్లు సంబరపడిపోయేవాళ్లం.
- పొట్నూరు రామారావు, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇరిగేషన్, శ్రీకాకుళం
రేడియో ఉంటే.. గౌరవం
1972లో నేషనల్ పేనాసోనిక్ రేడియోను రూ.150కి కొన్నాను. ఆ కాలంలో గ్రామాల్లో రేడియో ఉంటే గౌరవంగా చూసేవారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఇంత మార్పులు వస్తాయని అనుకోలేదు. ఫోన్లు రావడంతో రేడియో వినియోగం పూర్తిగా తగ్గింది.
- ఉర్లా బాలరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయడు, కోసమాళ
రేడియో ఇవ్వలేదని పెళ్లిలో తగువు
అప్పట్లో రేడియో, వాచీ, సైకిల్ కట్నకానుకల కింద ఇచ్చేవారు. మా కూమార్తె పెళ్లిలో కట్నం లాంచనాలు కింద రేడియో అడిగారు. రేడియో ఇవ్వకపోవడంతో పెళ్లిలో తగువు జరిగింది.
- అల్లడ డిల్లీశ్వరావు, కోసమాళ