మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:22 AM
Couple killed in road accident ఆయన ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తిరిగొచ్చి దుర్గమ్మ తల్లి ప్రసాదాన్ని బంధువులకు పంచేందుకు భార్యతో కలిసి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ దంపతులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాద ఘటన కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది.
ప్రసాదం పంచేందుకు వెళ్తూ..
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
జరజాంలో విషాదం
ఎచ్చెర్ల/ కోటబొమ్మాళి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆయన ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తిరిగొచ్చి దుర్గమ్మ తల్లి ప్రసాదాన్ని బంధువులకు పంచేందుకు భార్యతో కలిసి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ దంపతులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాద ఘటన కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన తిప్పాన రామారావు (54), పార్వతి(48) దంపతులు.. శనివారం కోటబొమ్మాళి సమీపాన జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. రామారావు శ్రీకాకుళం పీఎన్ కాలనీలో తాపీమేస్ర్తీగా స్థిరపడ్డారు. ఏటా భవానీ, అయ్యప్ప మాలలను ధరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు. ఇటీవల దసరా పురస్కరించుకుని భవానీ దీక్ష చేపట్టారు. ఈ నెల 22న రాత్రి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి.. శనివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. విజయవాడ నుంచి వచ్చీరాగానే విశ్రాంతి కూడా తీసుకోకుండా శనివారం ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని, కోటబొమ్మాళి కొత్తమ్మతల్లిని దర్శించుకున్నారు. తాను తెచ్చిన దుర్గమ్మ ప్రసాదాన్ని బంధువులకు ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి టెక్కలి మండలం విక్రంపురం వెళ్తున్నారు. ఈక్రమంలో సరిగా నిద్రలేకపోవడంతో మార్గమధ్యంలో శ్రీపురం (కోటబొమ్మాళి) సమీపంలో హైవేపై నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. కోటబొమ్మాళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
మిన్నంటిన రోదనలు
ఆధ్యాత్మికభావనతో.. అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు నందిని, నీలవేణి, కుమారుడు తారక్ ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. కుమారుడు తారక్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఒకేసారి తల్లిదండ్రుల మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, గ్రామస్థులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి.. వారి పార్థివదేహాలకు నివాళులర్పించారు. ఈ నెల 22న ఉదయం రామారావు మరదలు ముగతమ్మ (తమ్ముడు గురువునాయుడు భార్య) జరజాం ఎంపీటీసీగా కూటమి అభ్యర్థిగా ఎచ్చెర్లలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కూడా ఎంతో ఉత్సాహంగా రామారావు పాల్గొన్నారని స్థానికులు గుర్తుచేసుకున్నారు.