Share News

నూరేళ్ల బంధం.. నెలకే ముగిసింది

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:42 PM

Newlywed groom dies in road accident నెల రోజుల కిందటే పెళ్లి అయింది. ఆషాడమాసం నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితుడితో కలిసి ఆమెను చూసేందుకు ద్విచక్ర వాహనంపై నవ వరుడు వెళ్లాడు. తిరిగొస్తుండగా.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

నూరేళ్ల బంధం.. నెలకే ముగిసింది
వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ గణేష్‌.. ఇన్‌సెట్‌లో శ్రీకాంత్‌ (ఫైల్‌)

  • రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి

  • బైక్‌ అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొని..

  • బెలమర పోలవలసలో విషాదం

  • వారు నూరేళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. వారి ఆనందం నెలరోజులు కూడా నిలవలేదు. విధి ఆ దంపతులను శాశ్వతంగా వేరు చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు నవవరుడి ప్రాణాలు బలిగొంది. ఆ కొత్త పెళ్లికూతురి భవిష్యత్తును చీకట్లో ముంచేసింది. పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట్లో అంతలోనే మృత్యుఘోష వినిపించడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • నరసన్నపేట, జూలై 27(ఆంధ్రజ్యోతి): నెల రోజుల కిందటే పెళ్లి అయింది. ఆషాడమాసం నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితుడితో కలిసి ఆమెను చూసేందుకు ద్విచక్ర వాహనంపై నవ వరుడు వెళ్లాడు. తిరిగొస్తుండగా.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. నవ వధువు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన నరసన్నపేట సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలాకి మండలం బెలమర పోలవలసకు చెందిన గేదెల శ్రీకాంత్‌ (28) సోమవారం నరసన్నపేట వద్ద రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందాడు. ఆయన స్నేహితుడు పొన్నాన సురేష్‌ తీవ్ర గాయపడ్డాడు. శ్రీకాంత్‌కు గత నెల 21న శ్రీకాకుళం మండలానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. ఆషాడం మాసం కావడంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అత్తవారింట్లో ఉన్న భార్యను చూసేందుకు శ్రీకాంత్‌.. తన స్నేహితుడు పోలాకి మండలం పిరియా గ్రామానికి చెందిన పొన్నాన సురేష్‌తో కలిసి సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఒక హోటల్‌ వద్ద భోజనం పార్సిల్‌ కట్టించి తమ స్నేహితులకు సత్యవరం జంక్షన్‌ వద్ద అప్పగించారు. స్నేహితుడు సురేష్‌ను ఇంటికి దిగబెట్టేందుకు వెళ్తుండగా.. నరసన్నపేట సర్వీసురోడ్డులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చొన్న శ్రీకాంత్‌ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడుపుతున్న సురేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్‌ సహాయంతో క్షతగాత్రుడ్ని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్‌ఐ గణేష్‌ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. వాహనం అతివేగంగా నడపడం లేదా.. ఇంకా ఏదైనా వాహనం ఢీకొందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

  • మిన్నంటిన రోదనలు

  • శ్రీకాంత్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినా నెల రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య, తల్లిదండ్రులు ఆనందరావు, విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త మృతితో ఆ నవవధువు నోట మాట రావడంలేదు. శ్రీకాంత్‌ అన్నయ్య పిల్లలు యశస్విని, ధనుషల్‌ రోదన వర్ణణాతీతం. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Jul 27 , 2026 | 11:42 PM