Share News

రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:47 PM

రైతుల సంక్షేమానికి... వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట
విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాసరూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి... వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో సోమవారం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర పథకాలను ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. వ్యవసాయశాఖ ఏడీ శారద మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే భూమిసారం పెరగడమే కాకుండా దిగుబడులు సాధించవచ్చునన్నారు. అనంతరం ఎమ్మెల్యే విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వంకల కూర్మారావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, కుత్తుమ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

‘కుంకుమసాగరం ఆక్రమణలపై చర్యలు తీసుకోండి’

పలాస, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ జయరామచంద్రపురం గ్రామానికి చెందిన 150 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించే కుంకుమసాగరం చెరువులో ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు సోమవారం రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకుడు కిక్కర బాలకృష్ణ మాట్లాడుతూ సర్వే నెంబరు 251లో 8 ఎకరాల భూమిని ఓ వీఆర్వో ఆక్రమించి సాగు చేస్తున్నారని, తప్పుడు పత్రాలతో కొంతభూమిని విక్రయించారని ఆరోపించారు. చెరువు భూమిని కాపాడాలని కోరారు. ఉప తహసీల్దార్‌ వి.గిరిరాజుకు, మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయ డీటీ భాగ్యలక్ష్మిలకు వినతిపత్రాలు అందించారు. ఎమ్మెల్యేను కలుసుకున్న వారిలో రైతులు పి.చిన్నారావు, డొక్కర అప్పారావు, కిక్కరి దేవేంద్ర, ఆదినారాయణ, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:47 PM