Share News

వీధికో బెల్ట్‌!

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:29 AM

జిల్లాలో ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా నాలుగైదు కనిపిస్తున్నాయి.

వీధికో బెల్ట్‌!

- బయటకు కిరాణా దుకాణం

- లోపల మద్యం విక్రయాలు

- బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు

- లైసెన్స్‌డ్‌ దుకాణాల నుంచే సరఫరా

- తూతూమంత్రంగా ఎక్సైజ్‌ దాడులు

టెక్కలిరూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా నాలుగైదు కనిపిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పోటాపోటీగా ఆ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే కనిపిస్తున్నాయి. బయటకు కిరాణా సరుకులు పెట్టి లోపల మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 176 మద్యం షాపులతో పాటు 19 బార్లకు లైసెన్స్‌లు ఉన్నాయి. వీటి ద్వారానే బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ఒక క్వార్టర్‌ బాటిల్‌పై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే హెచ్చరిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌ కావడంతో అధికార్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తూతూ మంత్రంగా దాడులు చేసి కొన్ని మద్యం సీసాలు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలు..

- టెక్కలి పట్టణంలో పాతపట్నంకు వెళ్లే రహదారిలో ఓ హోటల్‌ పక్క ఉన్న కిరాణా షాపులో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మహిళలు నిత్యం అక్కడే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే, మందుబా బులతో వారు ఇబ్బందులు పడుతున్నారు.

- టెక్కలి ఆదీఆంధ్ర వీధి జాతీయ రహదారిపై ఉన్న కిరాణాషాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తుంది. టెక్కలి మండలం అక్కవరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాల్లో కొందరు మద్యం సేవించి ప్రమాదాలకు కారణమవుతున్నా పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదు.

- నరసన్నపేట సమీపంలోని మడపాం టోల్‌ గేట్‌ వద్ద ప్రతిరోజూ రాత్రి సమయంలో కొంత మంది ద్విచక్ర వాహనంపై మద్యం తీసుకువచ్చి లారీ డ్రైవర్లతో పాటు ఇతరులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది.

- శ్రీకాకుళం రూరల్‌ మండలం చింతాడలో పది వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి పక్కన, ఎఫ్‌సీఐ గోడౌన్‌ రూట్‌లో ఉన్న కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

పర్మిట్‌ రూంలు ఉన్నా..

లైసెన్డ్‌ మద్యం దుకాణాల వద్ద పర్శిట్‌ రూంలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే కొంతమంది వ్యాపారులు నిర్వహణ ఖర్చులు భరించలేక వాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో మద్యం షాపుల పక్కనే కొందరు కిరాణా, కిళ్లీ బట్టీలు పెట్టుకున్నారు. అక్కడే మద్యంతో పాటు గ్లాస్‌, నీరు, డ్రింక్‌లతో పాటు తినడానికి ఏర్పాటు చేస్తుండడంతో మందుబాబులు అక్కడకు వెళ్లి తాగుతున్నారు. మరికొంతమంది మద్యం తీసుకొని వెళ్లి దాబాల వద్ద సిటింగ్‌ వేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులకు ఈ విషయం తెలిసినా వారికి మామూళ్లు అందుతుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా వీరికి రూ.50 నుంచి రూ.80 వేల వరకు మామూళ్లు అందిస్తున్న కొంతమంది మద్యం వ్యాపారులు చెబుతున్నారు.

కేసులు నమోదు చేస్తున్నాం

బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా బెల్ట్‌షాపులు ఉన్నట్లు తెలిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలి. జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాలపై నిఘా పెట్టాం. దాబాల యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ మద్యం అమ్మడం గానీ తాగడం గానీ చేయరాదు. సారా నిర్మూలనకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి బెల్లపు ఊటలను ధ్వంసం చేస్తున్నాం.

-షేక్‌ మీరా సాహెబ్‌, ఎక్సైజ్‌ సీఐ టెక్కలి

Updated Date - Aug 20 , 2026 | 12:29 AM