పిడుగుల వర్షం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:12 AM
Three killed by lightning strikes జిల్లాలో సోమవారం సాయంత్రం ఉరుములు.. మెరుపులతో వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగుల మోత మోగింది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరుచోట్ల ముగ్గురి మృతి
నరసన్నపేట/ జలుమూరు/ఎల్.ఎన్.పేట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం సాయంత్రం ఉరుములు.. మెరుపులతో వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగుల మోత మోగింది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నరసన్నపేట మండలం దిద్దుపేట వద్ద సోమవారం సాయంత్రం పిడుగుపడి ముంజి పార్వతీ(65) అనే మహిళ మృతి చెందింది. సోమవారం సాయంత్రం పొలాలవైపు పాడి పశువులను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో పార్వతి మృతి చెందింది. దీంతో భర్త సూర్యనారాయణ, కుటుంబ సభ్యులు రోదించారు. సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఉపాధి పనికి వెళ్లి వస్తుండగా..
జలుమూరు మండలం బసివాడ గ్రామానికి చెందిన పొన్నాన నరసమ్మ(45) ఉపాధిహామీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందింది. నరసమ్మకు కుమారుడు లోకేష్, కుమార్తె రమ ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. భర్త ఐదేళ్ల కిందట మృతి చెందాడు. తల్లి కూడా మృతి చెందడంతో లోకేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
క్రికెట్ ఆడుతూ యువకుడు..
లక్ష్మినర్సుపేట గ్రామానికి చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రాజశేఖర్ తల్లిదండ్రులు మోహనరావు, మీనా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. రాజశేఖర్ ఇటీవల ఎల్.ఎన్.పేట వచ్చాడు. ఉమ్మడి జిల్లా భామిని(పార్వతీపురం మన్యం) మండలం సొలికిరిలో అమ్మమ్మ ఇంటికెళ్లాడు. సోమవారం అక్కడ యువకులతో కలిసి వంశధార నది ఒడ్డున క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
గొట్టిపల్లిలో ఆవు..
నరసన్నపేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన పిల్ల ఆదిలక్ష్మీకి చెందిన ఆవు పిడుగుపాటుకు గురై సోమవారం మృతి చెందింది. సుమారు రూ.70వేలు విలువ చేసే ఆవు మృతి చెందడంతో ఆదిలక్ష్మి బాధపడుతోంది. అలాగే నరసన్నపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో బజారులో వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. డ్రైనేజీలు మీద ఆక్రమణలు, అండర్ డ్రైనేజీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పలు వీధులు జలమయమయ్యాయి.