తొలిరోజు 96.75 శాతం హాజరు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:09 AM
Inter exams begining జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 71 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. 20,377 మంది విద్యార్థులకుగానూ 19,715 మంది(96.75 శాతం) పరీక్షలకు హాజరైనట్లు ఆర్‌ఐవో ఆర్.సురేష్‌కుమార్ తెలిపారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఉరుకులు.. పరుగులతో కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
నరసన్నపేట/ గుజరాతీపేట, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 71 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. 20,377 మంది విద్యార్థులకుగానూ 19,715 మంది(96.75 శాతం) పరీక్షలకు హాజరైనట్లు ఆర్‌ఐవో ఆర్.సురేష్‌కుమార్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 18,865 మందికిగాను 535 మంది, ఓకేషనల్‌కు సంబంధించి 1,512 మందికి 127 మంది మొత్తంగా 662 మంది గైర్హాజయ్యారని వెల్లడించారు. ఇదిలా ఉండగా నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే నిబంధన కారణంగా.. విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఉదయం 8.30 గంటలకు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తొలిరోజు కావడంతో చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేంద్రాలకు తీసుకెళ్లి.. వారు పరీక్ష రాసేవరకూ బయట నిరీక్షించారు. అలాగే జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు తెరవకుండా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళంలోని ఉమెన్స్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఏఎస్పీ పి.శ్రీనివాసరావుతోపాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పలు కేంద్రాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. నరసన్నపేటలో పరీక్షా కేంద్రాలను ఎస్‌ఐ గణేష్, ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలించారు. తొలిరోజు ఎటువంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు అఽధికారులు తెలిపారు.