పలాసలో 63.. ఇచ్ఛాపురంలో 31
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:24 AM
Municipal nominations gain momentum on the second day పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు శనివారం మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులు -18, వైసీపీ-41, జనసేన-3, ఇతరులు-1 నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారి ఈ.శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి తాళాసు శ్రీపద్మ కూడా నామినేషన్ వేశారు.
రెండోరోజు మునిసిపల్ నామినేషన్ల జోరు
పలాస/ ఇచ్ఛాపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు శనివారం మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులు -18, వైసీపీ-41, జనసేన-3, ఇతరులు-1 నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారి ఈ.శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి తాళాసు శ్రీపద్మ కూడా నామినేషన్ వేశారు. ఆదివారం వైసీపీ, టీడీపీ అభ్యర్థులంతా నామినేషన్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పలాసలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునిసిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న రోడ్లన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు, అభ్యర్థి, వారితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వంద మీటర్ల దూరంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేసి నిబంధనలు కఠినతరం చేశారు.
అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పెట్రోలు బంకు వద్ద డీఎస్పీ జీవీ రమణ, ఎస్ఐ తిరుపతిరావు అడ్డుకున్నారు. మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ఘట్టానికి ఆరు కార్లుతో ఉన్న కాన్వాయ్తో కౌన్సిలర్ అభ్యర్థులను వెంటపెట్టుకొని అప్పలరాజు తన నివాసం నుంచి బయలుదేరారు. కాగా.. 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున కాన్వాయ్తో రాకూడదని పోలీసులు చెప్పగా.. ఆయన వాగ్వాదానికి దిగారు. ఇబ్బందులు కలిగించేలా ర్యాలీ వద్దని డీఎస్పీ జీవీ రమణ నచ్చజెప్పడంతో వారంతా వెనుదిరిగారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థులంతా నిబంధనలకు మేరకు కేంద్రానికి చేరుకుని నామినేషన్లు వేశారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోనూ రెండోరోజు నామినేషన్ల జోరు పెరిగింది. శనివారం టీడీపీ తరపున 9 మంది అభ్యర్థులు, వైసీపీ నుంచి 13 మంది, జనసేన నుంచి ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు వేశారు. మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. మునిసిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు మల్లవరపు సూర్యతేజ(ఐఏఎస్) పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రమేష్ పాల్గొన్నారు.