518 ఫోన్లు రికవరీ
ABN , Publish Date - May 26 , 2026 | 11:41 PM
Handover of mobile phones worth Rs. 1 crore ప్రజలు పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్లను గుర్తించి, బాధితులకు వాటిని అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సైబర్ర్‌కైం, ఐటీసెల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి.. గత నాలుగు నెలల వ్యవధిలో సుమారు రూ.కోటి విలువ గల 518 ఫోన్లను రికవరీ చేశారు.
రూ.కోటి విలువైన మొబైళ్లు అప్పగింత
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రజలు పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్లను గుర్తించి, బాధితులకు వాటిని అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సైబర్ర్‌కైం, ఐటీసెల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి.. గత నాలుగు నెలల వ్యవధిలో సుమారు రూ.కోటి విలువ గల 518 ఫోన్లను రికవరీ చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించి స్వయంగా బాధితులకు ఫోన్లను అందించారు. ఇప్పటివరకు జిల్లా పోలీసులు 2024లో 622, 2025లో 1060, ఈ ఏడాది 518 మొత్తంగా 2,200 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వీటి విలువ సుమారు రూ.3.70కోట్లు ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించి ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవడం విశేషం.
ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఫోన్ బ్లాక్ చేసుకొనే అవకాశం ఉంది. ప్రజలు ఫోన్ వివరాలతో బ్లాకింగ్ అభ్యర్థన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాలు వంటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. జిల్లా సైబర్‌క్రైం, ఐటీ సెల్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తిస్తుంది. రికవరీ చేసి బాధితులకు అందజేస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సూర్యచంద్రమౌళి, పోలీస్ అధికారులు, సైబర్‌క్రైం, ఐటీసెల్ సిబ్బంది పాల్గొన్నారు.